Pulivendula: పులివెందులలో ఘోరం.. ఇద్దరు మహిళల గొడవకు పసిప్రాణం బలి, నీళ్ల డ్రమ్ములో ముంచి..

Pulivendula: కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో దారుణం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 26 Jun 2026 2:45 PM IST
Pulivendula
X

Pulivendula: పులివెందులలో ఘోరం.. ఇద్దరు మహిళల గొడవకు పసిప్రాణం బలి, నీళ్ల డ్రమ్ములో ముంచి..

Pulivendula: కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం లోపట్నూతల గ్రామంలో గుండెల్ని పిండేసే ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళల మధ్య ఉన్న ఈగోలు, పట్టింపులు.. చివరకు ఒక నిష్కల్మషమైన పసిప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఆడుకుంటూ కనిపించిన నిత్విక అనే మూడేళ్ల చిన్నారిని బాత్రూమ్‌లోని నీళ్ల డ్రమ్ములో ముంచి దారుణంగా హత్య చేశారు. ఈ మృగత్వపు ఘటనపై పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో ఒళ్లు గగుర్పొడిచే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. గురువారం (జూన్ 25, 2026) సాయంత్రం 4:30 గంటల సమయంలో చిన్నారి నిత్విక తన ఇంటి సమీపంలో తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటోంది. ఆ సమయంలో నిత్విక ఇంటి పక్కనే నివసించే స్వాతి అనే మహిళ, అక్కడ ఎవరూ లేని సమయాన్ని గమనించింది. నిత్వికకు ఆశ చూపి తన వెనుక పిలుచుకుంటూ వెళ్లింది. పక్క వీధిలో ఉన్న ఒక నిర్మానుష్య ఇంటి బాత్రూమ్‌లోకి పాపను తీసుకెళ్లి, అక్కడ ఉన్న నీళ్ల డ్రమ్ములో తలకిందులుగా ముంచింది. పాప ఊపిరాడక విలవిలలాడుతున్నా వదలకుండా ప్రాణం పోయే వరకు నీటిలోనే నొక్కిపట్టి క్రూరంగా చంపేసింది.

పోలీసుల దర్యాప్తులో హత్యకు గల కారణాలు తెలిసి గ్రామస్తులు ముక్కున వేలేసుకున్నారు. చిన్నారి తల్లి సృజన, నిందితురాలు స్వాతి గతంలో ప్రాణ స్నేహితులు. అయితే కొన్నాళ్ల క్రితం పిల్లల విషయంలో వీరిద్దరి మధ్య చిన్న గొడవ మొదలైంది. అది కాస్తా కాలక్రమేణా తీవ్ర వైరంగా మారింది. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టుకునేంత వరకు ఈ గొడవ వెళ్లింది. అప్పటి నుంచి సృజనపై పగతో రగిలిపోతున్న స్వాతి.. ఆమెకు కోలుకోలేని దెబ్బ కొట్టాలని డిసైడ్ అయింది. అందుకోసమే సృజన కళ్లల్లో నిరంతరం ఆనందం నింపే చిన్నారి నిత్వికను టార్గెట్ చేసి ఈ దారుణానికి ఒడిగట్టిందని పోలీసులు నిర్ధారించారు.

పాప కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. ఆ క్రమంలో స్వాతి ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరా పుటేజీని పోలీసులు పరిశీలించారు. అందులో స్వాతి నడుచుకుంటూ వెళ్తుండగా, ఆమె వెనుకే చిన్నారి నిత్విక నమ్ముకుంటూ వెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఈ తిరుగులేని ఆధారాలతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితురాలు స్వాతిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు పెద్దల మధ్య వచ్చిన గొడవ, ఒక తల్లికి జన్మంతా తీరని కడుపుకోతను మిగిల్చింది. నిందితురాలిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story