యూట్యూబ్‌లో హత్య ప్లాన్.. పాలకోవలో విషం.. ప్రొద్దుటూరు పద్మజ హత్య కేసులో భర్తే నిందితుడు!

Proddutur Woman Murder Case: ప్రొద్దుటూరు పద్మజ హత్య కేసు మిస్టరీ వీడింది. యూట్యూబ్ వీడియోలు చూసి భార్యను అంతం చేసిన కిరణ్ కుమార్. పాలకోవలో విషం కలిపి, దిండుతో నొక్కి చంపిన వైనం.

Arun Chilukuri
Published on: 5 May 2026 4:53 PM IST
Proddutur Padma Murder Case
X

యూట్యూబ్‌లో హత్య ప్లాన్.. పాలకోవలో విషం.. ప్రొద్దుటూరు పద్మజ హత్య కేసులో భర్తే నిందితుడు!

Proddutur Woman Murder Case: ప్రొద్దుటూరులో ఇటీవల జరిగిన వివాహిత పద్మజ మృతి కేసు కీలక మలుపు తిరిగింది. తొలుత ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించినప్పటికీ, పోలీసుల లోతైన విచారణలో ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా తేలింది. భార్యను తన భర్త కిరణ్ కుమారే అత్యంత క్రూరంగా చంపినట్లు పోలీసులు ధృవీకరించారు.

నిందితుడు కిరణ్ కుమార్ తన భార్య పద్మజపై అసహ్యం పెంచుకున్నట్లు విచారణలో వెల్లడైంది. భార్య లావుగా ఉందని, ఆమె వస్త్రధారణ బాగోలేదని కిరణ్ ఆమెను ఇష్టపడలేదు. కిరణ్‌కు గతంలో మరో మహిళతో వివాహేతర సంబంధం ఉండటం, ఆ విషయంలో పద్మజ తనను నిత్యం అనుమానిస్తూ నిలదీస్తుండటంతో ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

భార్యను ఎలా చంపాలో కిరణ్ యూట్యూబ్‌లో వీడియోలు చూసి నేర్చుకున్నాడు. హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విషాన్ని తెప్పించుకున్నాడు. ఆ విషాన్ని ఎవరికీ అనుమానం రాకుండా పాలకోవలో కలిపి పద్మజకు తినిపించాడు. విషం ప్రభావంతో పద్మజ అపస్మారక స్థితిలోకి వెళ్లగా, ఆమె బ్రతికే ఉంటుందేమో అన్న అనుమానంతో దిండుతో ముఖాన్ని గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. సుమారు అరగంట పాటు అలా అదిమి పట్టి ఆమె ప్రాణాలు తీశాడు.

హత్య అనంతరం ఏమీ తెలియనట్లు నటిస్తూ పద్మజ మంచం మీద నుంచి పడిపోయిందని ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. అయితే, సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు కిరణ్ ప్రవర్తనపై అనుమానం కలిగింది. తమదైన శైలిలో విచారించగా, కిరణ్ నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story