Pawan Kalyan: మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్.. పిఠాపురంలో 307 కి.మీ కొత్త రోడ్లు!

Pawan Kalyan: పిఠాపురం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూ.200 కోట్ల వ్యయంతో రోడ్ల పనులను వేగవంతం చేశారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

Arun Chilukuri
Published on: 6 Aug 2026 2:52 PM IST
Pawan Kalyan
X

Pawan Kalyan: మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్.. పిఠాపురంలో 307 కి.మీ కొత్త రోడ్లు!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. పిఠాపురాన్ని దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సుమారు రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో భారీ స్థాయిలో రహదారుల పునర్నిర్మాణ, విస్తరణ పనులను వేగవంతం చేశారు.

ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్, రోడ్లు-భవనాల శాఖల నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 307 కిలోమీటర్ల పరిధిలోని 611 రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటికే రూ. 100 కోట్ల వ్యయంతో 152 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం పూర్తయింది. మరో 70 రోడ్ల పనులు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయి. మొత్తంగా 80 శాతానికి పైగా పనులు పూర్తికావడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రవాణా కష్టాలు తొలగిపోయాయి.

సుబ్బంపేట పునరావాస కాలనీలో రూ. 1.52 కోట్లతో 1.5 కి.మీ సీసీ రోడ్లు, 2.8 కి.మీ డ్రెయినేజీ పనులను పూర్తి చేయించారు. రూ. 93 లక్షలతో 1.6 కి.మీ సిమెంట్ రోడ్లను నిర్మించి సుబ్బంపేట-కొత్తపల్లి ప్రధాన రహదారితో అనుసంధానించారు. తుఫాన్ల వల్ల దెబ్బతిన్న అమరవిల్లి-రామన్నపాలెం బీచ్ రోడ్డును రూ. 88 లక్షలతో పునర్నిర్మించి భక్తులు, స్థానికుల రాకపోకలకు వీలు కల్పించారు.

ఎస్‌ఈజెడ్ (SEZ) పరిధిలో నిర్లక్ష్యానికి గురైన ముమ్మడివారిపాడు గ్రామానికి రూ. 79.70 లక్షలతో శాశ్వత రహదారిని అందుబాటులోకి తెచ్చారు. కొత్తపల్లిలో రూ. 26.30 లక్షలతో 411 మీటర్ల సీసీ రోడ్డును పూర్తిచేసి దాదాపు 4 వేల మందికి సౌకర్యం కల్పించారు.

గత ప్రభుత్వ హయాంలో పాడైపోయిన కొండెవరం పరిధిలోని పిఠాపురం-ఉప్పాడ ఆర్ అండ్ బీ రోడ్డును రూ. 1.22 కోట్ల ఉపాధి హామీ నిధులతో 3.17 కి.మీ మేర యుద్ధప్రాతిపదికన నిర్మించారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటూ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు నిరంతరం మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముందడుగు వేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story