Yaddanapudi: పాఠశాలలను అద్భుత గురుకులాలుగా తీర్చిదిద్దుతాం: ఏలూరి!

Yaddanapudi: యద్దనపూడి PTMలో పాల్గొన్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. పాఠశాల మౌలిక వసతులు, 'తల్లికి వందనం' పథకంపై ఆయన మాట్లాడిన పూర్తి వివరాలు చూడండి.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 25 July 2026 11:43 AM IST
Yaddanapudi
X

Yaddanapudi: పాఠశాలలను అద్భుత గురుకులాలుగా తీర్చిదిద్దుతాం: ఏలూరి!

యద్దనపూడి: ప్రతి విద్యార్థి తన ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలన్నదే తమ లక్ష్యమని, ఆ దిశగా ప్రతి పాఠశాలనూ అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. శుక్రవారం యద్దనపూడిలో పర్చూరు నియోజకవర్గం మెగా పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌ (పీటీఎం) కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత సరస్వతీ దేవి చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం విద్యార్థులు ఎమ్మెల్యే ఏలూరికి ఆటపాటలతో ఘనస్వాగతం పలికారు. సందర్భంగా విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన తల్లికి వందనం పథకాన్ని విద్యార్థులు తల్లిదండ్రుల వివరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థి జీవితంలో తరగతి గదే బలమైన పునాది అని, ఎంచుకున్న లక్ష్యం దిశగా నిరంతరం కృషి చేయడమే ప్రతి విద్యార్థి కర్తవ్యమని పేర్కొన్నారు. తరగతి గదుల్లో ఎదురయ్యే ప్రతి సమస్యనూ పరిష్కరించి, విద్యార్థులకు ఆదర్శంగా నిలిచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. తాను ఈ స్థాయికి చేరుకోవడం వెనుక తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆశీస్సులే కారణమని, వారి పట్ల తనకు ఎనలేని కృతజ్ఞత ఉందని తెలిపారు.

తల్లికి వందనం పథకంతో ఆర్థిక సాయం...

నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ప్రవేశపెట్టిన వినూత్న కార్యక్రమాల్లో భాగంగా ప్రతి విద్యార్థికి 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేస్తున్నామని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చామని తెలిపారు. పర్చూరు నియోజకవర్గంలో మొత్తం 25,963 మంది విద్యార్థులు ఈ పథకం పరిధిలోకి రాగా, తాజాగా 1,335 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,59,35,000 జమ చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈ మొత్తాన్ని పిల్లల చదువుల కోసమే వినియోగించుకోవాలని తల్లులకు సూచించారు.

రక్షిత మంచినీటికి ప్రత్యేక ఏర్పాట్లు...

విద్యార్థులకు రక్షిత మంచినీరు అందించే లక్ష్యంతో పాఠశాలలో 1000 లీటర్ల సామర్థ్యం గల మంచినీటి ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ఆదేశించారు.

సీసీ రోడ్డు, డ్రైన్‌ నిర్మాణానికి ఆదేశం

పాఠశాల ప్రాంగణంలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు.

క్యాంటీన్‌, హాస్టల్‌ పరిశీలన...

కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే క్యాంటీన్‌, డైనింగ్‌ హాలు, హాస్టల్‌ గదులను స్వయంగా పరిశీలించారు. విద్యార్థినులకు అందించే భోజన నాణ్యత, పరిశుభ్రతపై ఆరా తీశారు.

పచ్చదనంతో పాఠశాల ముస్తాబు. .

పాఠశాల ప్రాంగణం పచ్చదనంతో ఉట్టిపడేలా ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటాలని ఎమ్మెల్యే సూచించారు. పండ్ల మొక్కలతో పాటు నీడనిచ్చే మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని డ్వామా అధికారులను ఆదేశించారు.

శానిటైజేషన్‌, సురక్షిత నీటిపై ప్రణాళికలు

పాఠశాలలో శానిటైజేషన్‌తో పాటు సురక్షిత నీటి సరఫరాకు తగిన ప్రణాళికలు రూపొందించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈని ఎమ్మెల్యే ఆదేశించారు.

ఈ కార్యక్రమాల్లో నియోజకవర్గ ప్రత్యేక అధికారి లవన్న, డ్వామా పిడి విజయలక్ష్మి, ఎంఈఓ లు సుబ్రహ్మణ్యం, గోపి ,ఎంపీడీవో శ్రీనివాసరావు , తాసిల్దార్ రవి కుమార్, ప్రధానోపాధ్యాయులు రాజ్యలక్ష్మీ, నాయకులు కనపర్తి నాగేశ్వరావు తారక రామారావు, సతీష్, నారాయణ స్వామి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story