నిజాయతీకి నిలువెత్తు రూపం.. ₹45 లక్షల బంగారం తిరిగిచ్చిన హోటల్ క్యాషియర్ శశి!
Tirupati: తిరుపతిలో ఒక అద్భుతమైన నిజాయతీ ఘటన వెలుగుచూసింది.
Tirupati: డబ్బు, బంగారం కనిపిస్తే చాలు అడ్డంగా దోచేసే ఈ రోజుల్లో.. కొందరు తమ నిజాయతీతో సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి ఒక అద్భుతమైన ఘటనే తిరుపతి నగరంలో చోటుచేసుకుంది. హోటల్‌లో భోజనం చేస్తూ పొరపాటున మరిచిపోయిన దాదాపు ₹45 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఓ మహిళా క్యాషియర్ తిరిగి ఇచ్చేసి.. ఒక పెళ్లింట వెలకట్టలేని ఆనందాన్ని నింపారు.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన శ్రీభరత్‌కుమార్ కుటుంబం తిరుమల శ్రీవారి సన్నిధిలో వివాహ వేడుకను ఘనంగా నిర్వహించుకుంది. పెళ్లి కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత బుధవారం కుటుంబ సభ్యులంతా కలిసి తిరుపతికి చేరుకున్నారు. ఇక్కడి జూపార్క్ రోడ్డులో ఉన్న 'గరుడాద్రి హోటల్'లో అందరూ కలిసి భోజనం చేశారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా బెంగళూరుకు తిరుగుప్రయాణమయ్యారు. అయితే, తీరా ఇంటికి చేరుకున్న తర్వాత వారికి మైండ్ బ్లాక్ అయ్యే నిజం తెలిసింది.
తాము తెచ్చుకున్న ఒక హ్యాండ్‌బ్యాగ్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు గమనించారు. ఆ బ్యాగులో దాదాపు ₹45 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. పెళ్లి నగల బ్యాగ్ మిస్ అవ్వడంతో ఆ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. వెంటనే భరత్‌కుమార్ అలర్ట్ అయి పోలీసు హెల్ప్‌లైన్ నంబర్ 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. తాము తిరుపతి హోటల్‌లో భోజనం చేసినప్పుడు బ్యాగ్ పొరపాటున మర్చిపోయి ఉంటామని పోలీసులకు వివరించారు.
ఫిర్యాదు అందుకున్న తిరుపతి పోలీసులు క్షణాల వ్యవధిలో స్పందించి గరుడాద్రి హోటల్‌కు చేరుకుని విచారణ చేపట్టారు. అక్కడ క్యాషియర్‌గా పనిచేస్తున్న శశి అనే మహిళను సంప్రదించగా.. ఆమె ఎంతో నిజాయతీగా తమకు ఒక హ్యాండ్‌బ్యాగ్ దొరికిందని, దాన్ని భద్రంగా దాచి ఉంచామని తెలిపారు. వెంటనే ఆ బ్యాగ్‌ను పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆ బ్యాగును పరిశీలించి నగలు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకున్నాక, భరత్‌కుమార్‌కు సమాచారం అందించి వారికి అందజేశారు.
తమ బంగారం సురక్షితంగా తిరిగి దొరకడంతో భరత్‌కుమార్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ ఆ నగలు దొరకకపోతే తమ పరిస్థితి ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ.. క్యాషియర్ శశికి, సకాలంలో స్పందించిన పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, క్యాషియర్ శశి నిజాయతీకి ముగ్ధులయ్యారు. ఆమెను ప్రత్యేకంగా జిల్లా పోలీస్ కార్యాలయానికి (డీపీవో) పిలిపించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. "మనిషి సంపాదించే అత్యంత విలువైన ఆస్తి నిజాయతీ. శశి చూపిన బాధ్యత, నిబద్ధత సమాజంలోని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం" అని కొనియాడారు. ఇలాంటి వ్యక్తుల వల్లే సమాజంలో నైతిక విలువలు బ్రతికున్నాయని ఆయన ప్రశంసించారు.




