Anantapur: అనంతలో హైటెన్షన్.. రాజు వర్సెస్ తోపుదుర్తి!

Anantapur: అనంతపురంలో రాజకీయ సెగలు రేగుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

Arun Chilukuri
Updated on: 9 July 2026 11:12 AM IST
Anantapur
X

Anantapur: అనంతలో హైటెన్షన్.. రాజు వర్సెస్ తోపుదుర్తి!

Anantapur: అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మధ్య చోటుచేసుకున్న సవాళ్లు, ప్రతిసవాళ్లతో జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. తనపై తోపుదుర్తి చేసిన ఆరోపణలను సాయంత్రం 5 గంటల లోపు నిరూపించాలని ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు సవాల్ విసిరారు. ఒకవేళ ఆరోపణలు నిరూపించలేకపోతే తోపుదుర్తి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించడంతో అనంతపురంలో ఏం జరుగుతుందోనన్న తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఇల్లు, అలాగే ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు నివాసాల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. తోపుదుర్తి ఇంటి చుట్టూ రక్షణగా బారికేడ్లు, కంచెలను ఏర్పాటు చేశారు. మరోవైపు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సైతం తగ్గేదే లేదంటూ వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పోలీసులను తోసుకుని అయినా సరే రావాలని, ఎమ్మెస్ రాజుతో తేల్చుకుంటామని ఆయన వ్యాఖ్యానించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.

ఈ హైడ్రామా మధ్య ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు నివాసానికి చేరుకుని ఆయనకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నాయకులు కేవలం వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యారని మండిపడ్డారు.

ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు కేవలం రాజకీయ అసూయతో కూడుకున్నవేనని కాల్వ కొట్టిపారేశారు. ఇటీవల జరిగిన ఒక టిప్పర్ ఘటనను హత్యాయత్నంగా చిత్రీకరించి చూపించడం ఏమాత్రం సబబు కాదన్నారు. వ్యక్తిగత విమర్శలు పక్కనబెట్టి, ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై మాట్లాడాలని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి కాల్వ శ్రీనివాసులు హితవు పలికారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story