Guntur: ‘మన పెళ్లి జరగదు’ అని ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్య!
Guntur: గుంటూరులో ప్రేమికుల ఆత్మహత్య విషాదం నింపింది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరగలేదన్న బాధతో వివాహిత, ఆమె ప్రియుడు కొండవీడులో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.
Guntur: ‘మన పెళ్లి జరగదు’ అని ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్య!
Guntur: పెద్దల పట్టుదల, కులాల పట్టింపులు ఇద్దరు యువతీయువకుల ప్రాణాలను బలితీసుకున్నాయి. ప్రేమించిన యువకుడితో కాకుండా వేరే వ్యక్తితో పెళ్లి జరగడంతో మనస్తాపం చెందిన ఓ యువతి, ప్రియుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
గుంటూరు స్వర్ణ భారతి నగర్‌కు చెందిన రాజు (డిగ్రీ సెకండ్ ఇయర్), అంకమ్మ నగర్‌కు చెందిన యువతి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలిసినా, ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావడంతో పెళ్లికి అడ్డంకులు ఏర్పడ్డాయి. గతంలో ఒకరి తల్లిదండ్రులు ఒప్పుకుంటే మరొకరి తల్లిదండ్రులు నిరాకరించారు. చివరకు యువతి తల్లిదండ్రులు ఆమెకు గత నెల 15న మరొక వ్యక్తితో వివాహం జరిపించారు.
పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లిన యువతి, మూడు రోజుల క్రితం పుట్టింటికి (గుంటూరు) వచ్చింది. ఈ క్రమంలో ప్రియుడు రాజు ఆమెను కలిసి మాట్లాడాడు. ఇక తాము కలిసే అవకాశం లేదని భావించిన వీరిద్దరూ ప్రాణాలు విడవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 7వ తేదీన ఇద్దరూ కలిసి కొండవీడు వెళ్లి అక్కడ పురుగుల మందు తాగారు.
స్థానికులు వీరిని గమనించి వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో 8వ తేదీన రాజు మరణించగా, చికిత్స పొందుతూ 9వ తేదీన యువతి కూడా కన్నుమూసింది. ఇద్దరి తల్లుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిల్లల మనోభావాలను గుర్తించకుండా తల్లిదండ్రులు పట్టుదలకు పోవడమే ఈ విషాదానికి కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.




