CM Chandrababu: గూగుల్ రాక ఏపీకి ‘గేమ్ ఛేంజర్’.. అంతర్జాతీయ డేటా గేట్‌వేగా విశాఖ..
CM Chandrababu: విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూగుల్ రాక ఏపీ అభివృద్ధికి గేమ్ ఛేంజర్ అని, 2028 నాటికి ప్రాజెక్టు పూర్తి కావాలని లక్ష్యంగా విధించారు.
CM Chandrababu: గూగుల్ రాక ఏపీకి ‘గేమ్ ఛేంజర్’.. అంతర్జాతీయ డేటా గేట్‌వేగా విశాఖ..
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు ఒక మరుపురాని ఘట్టమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. విశాఖ జిల్లా తర్లువాడలో ఈ భారీ ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ కేంద్రం కేవలం ఏపీకే కాకుండా దేశానికే ఒక 'గ్రోత్ ఇంజిన్'గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.
టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ సగర్వంగా తలెత్తుకునే రోజు వచ్చిందని సీఎం అన్నారు. ఒక గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ ఏఐ డేటా సెంటర్ ద్వారా భారతదేశానికి ఏపీ అంతర్జాతీయ డేటా గేట్‌వేగా మారుతుందన్నారు. "గూగుల్ యొక్క అత్యాధునిక ఆవిష్కరణలు, ఏపీ ప్రభుత్వ 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానం కలిసి అద్భుతాలు సృష్టించబోతున్నాయి" అని చంద్రబాబు ఉద్ఘాటించారు.
భవిష్యత్తులో అనకాపల్లి జిల్లా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తరహాలో భారీగా అభివృద్ధి చెందుతుందని సీఎం జోస్యం చెప్పారు. విశాఖలో వ్యాపార నిర్వహణ ఖర్చు ఇతర నగరాల కంటే తక్కువగా ఉండటం పెట్టుబడిదారులకు గొప్ప అవకాశమని తెలిపారు. అలాగే, జూలైలో భోగాపురం ఎయిర్‌పోర్టును జాతికి అంకితం చేస్తామని, జూన్ 1న దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
గూగుల్ డేటా సెంటర్ నిర్మాణాన్ని 2028 సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అవసరమైతే రెండు మూడు నెలలు ముందుగానే పూర్తి చేసేందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా, ప్రాజెక్టుల ప్రారంభంలోనూ తమ ప్రభుత్వం ముందుంటుందని సీఎం స్పష్టం చేశారు.




