దేవీపట్నంలో పులి వేట.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి హైటెక్ టీమ్స్!
Devipatnam: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పోలవరం జిల్లా దేవీపట్నం మండలం నెలకోట కొండ ప్రాంతంలో పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ హైటెక్ ఆపరేషన్ చేపట్టింది.
దేవీపట్నంలో పులి వేట.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి హైటెక్ టీమ్స్!
దేవీపట్నం/పోలవరం: గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, పోలవరం జిల్లా దేవీపట్నం మండలం నెలకోట సమీపంలోని కొండ ప్రాంతంలో సంచరిస్తున్న పులిపై అటవీ శాఖ హనుమాన్ ప్రత్యేక బృందాలు రాత్రి పగలు నిరంతర నిఘా కొనసాగిస్తూయి.
అధునాతన థర్మల్ డ్రోన్ల సహాయంతో పులి కదలికలను నిశితంగా గమనించారు. పులి ప్రస్తుతం నెలకోట సమీపంలోని అటవీ కొండ ప్రాంతంలోనే ఉన్నట్లు గుర్తించబడింది. ప్రజల భద్రత దృష్ట్యా పులి గ్రామాల వైపు వెళ్లకుండా అటవీ శాఖ ప్రత్యేక చర్యలు కొనసాగిస్తోంది.
గత ఆరు రోజులు నుండి కొత్తగా పశువులపై దాడులు లేదా పశువుల మరణాలు జరగకుండా అటవీశాఖ హనుమాన్ బృందాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. పరిస్థితి ప్రశాంతంగా ఉంది.
అటవీ శాఖ ప్రత్యేక రెస్క్యూ బృందాలు, ట్రాంక్విలైజేషన్ బృందాలు, డ్రోన్ బృందాలు మరియు ఫీల్డ్ సిబ్బంది వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించి పులి కదలికలను నిరంతరం గమనిస్తున్నారు. అవసరమైతే తక్షణ చర్యలు తీసుకునేందుకు అన్ని బృందాలు సిద్ధంగా ఉన్నాయి.
గ్రామాల్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ (PAS) ద్వారా ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించబడుతోంది. గ్రామస్తులు అనవసరంగా కొండ ప్రాంతాలకు వెళ్లరాదని, పశువులను అడవి అంచుల్లో లేదా గ్రామ శివార్లలో తాళ్లతో కట్టి వదిలివేయరాదని, రాత్రి సమయంలో సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని సూచించబడింది.
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పరిస్థితిని 24 గంటలూ పర్యవేక్షిస్తున్నారు. అటవీ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, వదంతులను నమ్మవద్దని, పులి కదలికలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తోంది.




