Konaseema: కోనసీమ జిల్లాలో ‘భూ రీ-సర్వే’పై కలెక్టర్ మహేష్ కుమార్ సమీక్ష: జనవరి నాటికి కొత్త పాస్ పుస్తకాల పంపిణీ!
Konaseema Land Re-Survey: కోనసీమ జిల్లాలో భూ వివాదాల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన రీ-సర్వే ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఆదేశించారు.
అమలాపురం: జిల్లాలో భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన రీ-సర్వే కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, శాస్త్రీయ పద్ధతుల్లో అమలు చేయాలని కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్, భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి. జయలక్ష్మి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 22-A భూములు, రీ-సర్వే పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, అటవీ భూములు, గృహవసతి తదితర అంశాల పురోగతిపై ఉన్నతాధికారులు జిల్లాల వారీగా సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ రెవెన్యూ, సర్వే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతుల భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తూ, వారి సమక్షంలో వారి ఆమోదంతోనే భూ సరిహద్దులను నిర్ధారించాలన్నారు సర్వే ప్రక్రియలో ప్రతి అడుగులోనూ రైతుల ప్రమేయం తప్పనిసరన్నారు.
ఆధునిక సాంకేతికత వినియోగంతో భూ సరిహద్దులు పక్కాగా ఉండేలా అత్యాధునిక రోవర్లను వినియోగించాలన్నారు. రికార్డుల భద్రత కోసం బ్లాక్ చెయిన్ టెక్నాలజీని, భూ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు పాస్ పుస్తకాలపై డైనమిక్ క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రానున్న జనవరి నాటికి జిల్లాలో రీ-సర్వే ప్రక్రియను సంపూర్ణంగా ముగించి, రైతులకు సురక్షితమైన కొత్త పాస్ పుస్తకాలను అందించాలన్నారు.ప్రస్తుత నెలలో 8 గ్రామాలు, వచ్చే నెల నాటికి 18 గ్రామాల రీ-సర్వే డేటాను సిద్ధం చేసి సమర్పించాలన్నారు. రెవెన్యూ అధికారులు ప్రతి రోజూ కనీసం రెండు గంటల సమయాన్ని రీ-సర్వే పనుల పర్యవేక్షణకు కేటాయించాలన్నారు.
రాజోలు, ముమ్మిడివరం, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. సర్వే ప్రక్రియ చివరి దశకు చేరుకున్న తరుణంలో, జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రతి గ్రామానికి సంబంధించిన సర్వే డేటాను నిశితంగా పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుందన్నారు. భూములకు సంబంధించి ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాటిని గ్రామ సభల ద్వారా తక్షణమే పరిష్కరిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. మ్యాప్‌లలో విస్తీర్ణ లోపాలు, తప్పులను సరి చేసే పూర్తి బాధ్యత గ్రామ సర్వేయర్లు, రెవెన్యూ అధికారులదేనన్నారు. రైతుల నుంచి ఇ-కేవైసీ ప్రక్రియ ద్వారా తుది ఆమోదం తీసుకున్న తర్వాతే, భూ హక్కుల తుది రికార్డును జిల్లా గెజిట్‌లో అధికారికంగా ప్రచురించి, గ్రామ సభల ద్వారా పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోo నైదియాదేవి, డిఆర్ఓ వి .సుబ్బారావు, ఆర్డీవోలు జి .మమ్మీ, జీ.వి.వి సత్యనారాయణ, ఏ.సరళావతి జిల్లా అటవీ శాఖ అధికారి ఎం. వి.ప్రసాద రావు, సర్వేన ల్యాండ్ రికార్డ్స్ ఏ.డి. కే.ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు




