Chandrababu: గొడ్డలి పార్టీతో జాగ్రత్త.. అమరావతి దేవతల రాజధాని.. వైసీపీపై సీఎం తీవ్ర విమర్శలు

Chandrababu: తిరుపతి జిల్లాలో 'వీబీ జీరామ్‌జీ' పథకానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు శ్రీకారం చుట్టారు.

Arun Chilukuri
Updated on: 2 July 2026 2:59 PM IST
Chandrababu
X

 Chandrababu: గొడ్డలి పార్టీతో జాగ్రత్త.. అమరావతి దేవతల రాజధాని.. వైసీపీపై సీఎం తీవ్ర విమర్శలు

Chandrababu: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామాల ముఖచిత్రాన్ని మార్చే సరికొత్త సంస్కరణకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉపాధి హామీ పథకానికి మరిన్ని మెరుగైన సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'వీబీ జీరామ్‌జీ' పథకాన్ని తిరుపతి జిల్లా ముక్కాలవారి పల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సరికొత్త ఆలోచనలతో ఈ పథకాన్ని రూపొందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

గతంలో ఉపాధి హామీ పథకం రాయలసీమ నుంచే ప్రారంభమైందని గుర్తుచేసిన చంద్రబాబు, ఇప్పుడు అదే రాయలసీమ గడ్డపై నుంచి మరింత మెరుగైన ‘వీబీ జీరామ్‌జీ’కి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 7,700 కోట్లు, రాష్ట్ర వాటాగా రూ. 4,000 కోట్లు కలిపి మొత్తం రూ. 11,700 కోట్ల పైనే ఖర్చు పెడుతున్నట్లు వెల్లడించారు.

ఈ పథకం కింద గ్రామాల అభివృద్ధికి అవసరమైన రహదారులు, డ్రైనేజీల నిర్మాణం, భూసార పరిరక్షణ పనులు చేపట్టవచ్చని చెప్పారు. పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం గొప్ప విషయమన్నారు. దొంగ లెక్కలకు ఆస్కారం లేకుండా పూర్తి డిజిటల్ విధానం, రియల్ టైమ్ మానిటరింగ్ తీసుకువచ్చినట్లు స్పష్టం చేశారు. ఒకప్పుడు ఎంజీనరేగాలో కేంద్ర, రాష్ట్రాల వాటా 90-10గా ఉండేదని, ఇప్పుడు రాష్ట్ర వాటా 40 శాతానికి పెరిగిందని, గత వైసీపీ ప్రభుత్వం ఈ నిధులన్నింటినీ దారిమళ్లించిందని మండిపడ్డారు.

ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలోని గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని చంద్రబాబు ప్రశంసించారు. గతంలో ఒకే రోజు గ్రామసభలు నిర్వహించి పవన్ కల్యాణ్ గిన్నిస్ రికార్డు సృష్టించారని గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 13,226 గ్రామాల్లో ఒకేసారి గ్రామసభలు పెట్టి.. వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 40 వేల గోకులాలు, 15,500 నీటి తొట్టెల నిర్మాణాలకు ఆమోదం తెలిపిన ఘనత పవన్ కల్యాణ్‌కే దక్కుతుందన్నారు. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, గిరిజన తండాల్లో సైతం పవన్ కల్యాణ్ చొరవతోనే రోడ్లు పడుతున్నాయని కొనియాడారు.

రాయలసీమ అభివృద్ధిపై మాట్లాడుతూ.. గాలేరు-నగరి కాల్వను కోడూరుకు తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని, జలధార కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలను పెంచుతామని హామీ ఇచ్చారు. రాయలసీమను 'రతనాల సీమ'గా మారుస్తామని భరోసా ఇచ్చారు.

ఈ వేదికపై నుంచి ప్రతిపక్ష వైసీపీపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "రాష్ట్రంలో ఒక గొడ్డలి పార్టీ ఉంది, ప్రజలంతా ఆ పార్టీతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్లు రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఎన్నికలకు ముందు అసెంబ్లీ సాక్షిగా అమరావతికి జై కొట్టారు. ఆ తర్వాత అధికారంలోకి రాగానే మూడు ముక్కలాట (మూడు రాజధానులు) ఆడారు. తీరా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక ఇప్పుడు వైజాగ్ అంటున్నారు. మన రాజధాని అమరావతే.. అది దేవతల రాజధాని, దాని అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరు." అని చంద్రబాబు స్పష్టం చేశారు.

అలాగే గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, విశాఖకు రైల్వే జోన్ సాధించడంతో పాటు ఉత్తరాంధ్రకు గూగుల్ డేటా సెంటర్ రాబోతోందని సీఎం చంద్రబాబు సగర్వంగా ప్రకటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story