Chandrababu: దేశంలోనే తొలి ప్రైవేట్ గోల్డ్ మైన్.. జొన్నగిరి ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు!

Chandrababu: ఏపీలోని కర్నూలు జిల్లా జొన్నగిరిలో దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రంగానికి చెందిన బంగారం గని, ఉత్పత్తి కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

Arun Chilukuri
Published on: 24 Jun 2026 2:42 PM IST
Chandrababu
X

 Chandrababu: దేశంలోనే తొలి ప్రైవేట్ గోల్డ్ మైన్.. జొన్నగిరి ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు!

Chandrababu: ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాకుండా, యావత్ దేశ పారిశ్రామిక రంగాంలోనే ఒక సరికొత్త రికార్డు నమోదైంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బంగారం గని (Gold Mine) ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అధికారికంగా ప్రారంభించారు. వాణిజ్యపరంగా ఇక్కడి నుంచి బంగారం ఉత్పత్తి చేసే ప్రక్రియను ప్రారంభించిన సీఎం.. అనంతరం ప్రాజెక్టుకు సంబంధించిన రెండో యూనిట్‌ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

భారతదేశంలో ప్రైవేటు రంగంలో ఒక సంస్థ బంగారం గనుల తవ్వకం, విక్రయం మరియు వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రక్రియను చేపట్టడం ఇదే మొట్టమొదటిసారి కావడం విశేషం. ఈ జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టు కోసం జియో మైసూర్‌ సర్వీసెస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, దక్కన్‌ గోల్డ్‌మైన్స్‌ లిమిటెడ్‌ సంస్థలు సంయుక్తంగా ఇప్పటి వరకు రూ.405 కోట్ల భారీ పెట్టుబడిని వెచ్చించాయి. ఇక్కడ ప్రయోగాత్మకంగా (Trial Run) నిర్వహించిన పసిడి ఉత్పత్తి ప్రక్రియ వంద శాతం విజయవంతం కావడంతో, ఇప్పుడు వాణిజ్యపరమైన ఉత్పత్తిని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ ఘనతతో ప్రపంచంలోనే అతికొద్ది ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ బంగారం ఉత్పత్తి కేంద్రాల సరసన జొన్నగిరికి అంతర్జాతీయ గుర్తింపు లభించనుంది.

జొన్నగిరి మైనింగ్ కేంద్రం నుంచి ప్రతీయేటా రెండు టన్నుల (2,000 కేజీలు) మేర బంగారాన్ని ఉత్పత్తి చేసేలా జియోమైసూర్‌ సంస్థ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది.

ప్లాంట్ ప్రారంభమైన తొలి ఏడాది సుమారు 400 కేజీల నాణ్యమైన బంగారాన్ని ఉత్పత్తి చేయనున్నారు.

ఇక్కడ ఉత్పత్తి చేసే బంగారం మొత్తం విలువపై 4 శాతం రాయల్టీ రూపంలో ఏపీ ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది. తొలి ఏడాది 400 కేజీల ఉత్పత్తి ద్వారానే దాదాపు రూ.57 కోట్ల ఆదాయం నేరుగా ప్రభుత్వ ఖజానాకు చేరనుంది.

ఈ భారీ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ద్వారా స్థానికంగా ఉన్న సుమారు 700 మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

జొన్నగిరి గని కార్యకలాపాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం ఏపీ పారిశ్రామిక రంగానికి పెద్ద ఊపునిస్తుందని, భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story