AP: ఎల్ నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష!
AP: రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
AP: ఎల్ నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష!
AP: రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా లోటు వర్షపాతం, ఖరీఫ్ పంటల సాగు పరిస్థితులు, జల వనరుల లభ్యత, రైతులకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, పంటల ప్రత్యామ్నాయ ప్రణాళికలపై సంబంధిత శాఖల అధికారులతో విస్తృతంగా చర్చించారు. అక్టోబర్ నెల వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు వివరించగా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు.
వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా ఏయే ప్రాంతాల్లో ఏ పంటలు అనుకూలంగా ఉంటాయో వ్యవసాయ శాఖ శాస్త్రీయ సూచనలు ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని, ప్రతి మండలంలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రైతులు సమయానికి నిర్ణయం తీసుకునేలా వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
ఎల్ నినో ప్రభావం, వర్షాల లోటు కారణంగా ఎదురయ్యే పరిస్థితులను రైతులకు స్పష్టంగా వివరించేందుకు ప్రత్యేక సమాచార ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. అపోహలు లేకుండా శాస్త్రీయ సమాచారం అందించడంతో పాటు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా రైతులకు వివరించాలని చెప్పారు. వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పశుసంవర్ధక శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు అందించాలని ఆదేశించారు.
పీఎండీఎస్ (PMDS) విధానంలో సాగు చేపట్టేలా రైతులను సమాయత్తం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల్లో నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ దిగుబడులు తగ్గకుండా వ్యవసాయ పద్ధతులను రైతులకు పరిచయం చేయాలని సూచించారు. నీటి సంరక్షణ, మైక్రో ఇరిగేషన్, పంటల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు.
జల వనరుల లభ్యతపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు, సాగునీటి పంపిణీ, తాగునీటి అవసరాలు, భూగర్భ జలాల పరిస్థితిపై అధికారులు వివరించగా, అందుబాటులో ఉన్న నీటిని అత్యంత సమర్థంగా వినియోగించేలా ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమీక్షలో ఎఫ్‌సీవీ (ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా) పొగాకు కొనుగోళ్ల అంశంపైనా సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. రైతులు పండించిన పొగాకు కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, మార్కెటింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా రొయ్యల సాగుదారులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని రొయ్య మేత ధరలను నియంత్రించే చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలకు సూచించారు.
ఈ సమీక్ష సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, వ్యవసాయ, జల వనరులు, ఉద్యానవన, మత్స్య, పశుసంవర్ధక శాఖల ఉన్నతాధికారులు హాజరై రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు. వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.




