AP: స్థానిక ఎన్నికల్లోనూ కూటమిదే విజయం: మంత్రి వై. సత్యకుమార్ యాదవ్!

AP: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై విజయవాడలో బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ సమావేశమైంది.

Hari Kishan  AP Bureau Chief
Updated on: 4 Aug 2026 7:20 PM IST
AP
X

AP: స్థానిక ఎన్నికల్లోనూ కూటమిదే విజయం: మంత్రి వై. సత్యకుమార్ యాదవ్!

AP: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కూటమి పార్టీల్లో రాజకీయ కసరత్తు వేగం పుంజుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన విజయాన్ని స్థానిక ఎన్నికల్లోనూ కొనసాగించడమే లక్ష్యంగా సమన్వయంతో ముందుకు సాగాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అధ్యక్షతన జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. సమావేశానికి బీజేపీ జాతీయ సహసంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ జీ హాజరై ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, స్థానిక ఎన్నికల సన్నాహకాలు, కూటమి వ్యూహం, కార్యకర్తల సమన్వయం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు మంత్రి తెలిపారు. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేసే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. 2024 ఎన్నికల్లో ఏర్పడిన కూటమి స్ఫూర్తిని యథాతథంగా కొనసాగిస్తూ స్థానిక ఎన్నికల్లోనూ విజయదుంధుభి మోగించడమే లక్ష్యమన్నారు.

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దానిని గాడిలో పెట్టేందుకు ప్రణాళికాబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటోందని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా ప్రజలు వ్యక్తం చేసిన ఆదరణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, మూడు ఎకనామిక్ కారిడార్ల ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఊపు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఇవి కీలకంగా మారనున్నాయని చెప్పారు.

స్థానిక ఎన్నికల్లో కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకం విషయంలో ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని మంత్రి స్పష్టం చేశారు. అయితే గతంతో పోలిస్తే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోందన్నారు. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు లభించేలా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. స్థానిక పరిస్థితులు, పార్టీ బలం, గెలుపు అవకాశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు.

ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన మంత్రి, రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించి బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఉత్తరాంధ్ర బాధ్యతలను ఎమ్మెల్యే నడికుడి ఈశ్వరరావు, గోదావరి ప్రాంతాన్ని తపన చౌదరి, కోస్తాంధ్రను వల్లూరి జయప్రకాశ్ నారాయణ్, రాయలసీమను ఎమ్మెల్యే పార్థసారథి పర్యవేక్షిస్తారని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా సమన్వయ బాధ్యతలను ఎమ్మెల్సీ సోము వీర్రాజు నిర్వహిస్తారని వెల్లడించారు. కమిటీ సభ్యులు అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల వ్యూహాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తారని చెప్పారు.

గత ప్రభుత్వ పాలనలో నామినేషన్ దాఖలు చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించిన మంత్రి, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవన్నారు. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛాయుత, పారదర్శక ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో పాటు ఎమ్మెల్యేలు సి. ఆదినారాయణరెడ్డి, పార్థసారథి, నడికుడి ఈశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తపన చౌదరి,తదితరులు పాల్గొని స్థానిక ఎన్నికల వ్యూహంపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల సన్నాహకాలను మరింత వేగవంతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story