Bhogapuram International Airport: జనసంద్రంగా భోగాపురం.. విమానాశ్రయం ప్రారంభోత్సవానికి పోటెత్తిన జనం!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి జనం భారీగా తరలివస్తున్నారు.

Arun Chilukuri
Updated on: 1 Aug 2026 11:27 AM IST
Bhogapuram International Airport
X

Bhogapuram International Airport: జనసంద్రంగా భోగాపురం.. విమానాశ్రయం ప్రారంభోత్సవానికి పోటెత్తిన జనం!

Bhogapuram International Airport: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, ప్రతిష్ఠాత్మక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు.

చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు 2,500కు పైగా బస్సుల్లో వేలాది మంది జనం ఇక్కడికి చేరుకోవడంతో భోగాపురం పరిసర ప్రాంతాలన్నీ కిటకిటలాడుతూ జన సంద్రంలా మారాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచే సభా ప్రాంగణం వద్ద కోలాహలం మొదలైంది.

ఈ భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను నాయకులు, మంత్రులు దగ్గరుండి పర్యవేక్షించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్, పార్థసారథి, వంగలపూడి అనిత, గుండు సుధారాణి వీరితో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉదయమే భోగాపురం చేరుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను సమన్వయం చేశారు.

సభకు తరలివచ్చిన ప్రజలకు ప్రభుత్వం ఘనంగా అతిథి మర్యాదలు చేస్తోంది. ప్రజలు తమ స్వగ్రామాల నుంచి బయలుదేరిన సమయం నుండి తిరిగి సురక్షితంగా ఇళ్లకు చేరే వరకు అన్ని వసతులూ కల్పించేలా ప్రణాళిక రూపొందించారు.

తరలివచ్చిన ప్రజలందరికీ ఉదయమే నాణ్యమైన టిఫిన్, తాగునీటి బాటిళ్లను పంపిణీ చేశారు. ప్రధాని సభ పూర్తయి తిరుగు పయనమయ్యే సమయంలో ప్రజలకు భోజన వసతి కల్పిస్తున్నారు. తొలుత బస్సుల్లోనే ఆహారం ఇవ్వాలని భావించినప్పటికీ, మంత్రుల సూచనల మేరకు ప్రతి 2,000 మందికి ఒక పాయింట్ చొప్పున ఏర్పాటు చేసి వేడివేడిగా భోజనాలు అందించేలా చర్యలు చేపట్టారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో భోగాపురం పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story