ఏపీలో వింత వాతావరణం.. అటు మండుతున్న ఎండలు, ఇటు పిడుగులతో కూడిన వర్షాలు!

AP Weather: ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు ద్రోణి ప్రభావంతో అకాల వర్షాలు కురుస్తున్నాయి.

HARIKISHAN
Published on: 8 April 2026 8:20 PM IST
AP Weather
X

ఏపీలో వింత వాతావరణం.. అటు మండుతున్న ఎండలు, ఇటు పిడుగులతో కూడిన వర్షాలు!

AP Weather: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఎండ తీవ్రత పెరుగుతుండగా, మరోవైపు పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా అంతర తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో గురువారం కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని పేర్కొన్నారు. ఇటీవల కురిసిన వర్షాల్లో తూర్పు గోదావరి జిల్లా పైడిమెట్టలో 44 మిల్లీమీటర్లు, కాకినాడ జిల్లా డి.పోలవరంలో 37.7 మిల్లీమీటర్లు, సీతానగరంలో 32.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

వర్షాల సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రైతులు, పశు కాపరులు ఉరుములు, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఆశ్రయం పొందరాదని సూచించారు. భద్రతా చర్యలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.

ఇక రాయలసీమ జిల్లాల్లో ఎండ తీవ్రత మరింత పెరుగుతోంది. పల్నాడు, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, కడప, అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో ఎండల నుంచి రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకపోవడం, తగినంత నీరు తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం వంటి సూచనలు చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో ఎండలు, వర్షాలు కలిసిన విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

HARIKISHAN

HARIKISHAN

Next Story