Weather Update : ఏపీ, తెలంగాణల్లో ముసురుతున్న వానలు.. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ తెలిపింది. తెలంగాణలో 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, గోదావరి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక హెచ్చరించారు.
Weather Update
Weather Update : తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ మరో ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. పశ్చిమ విదర్భ, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి స్పష్టమైన అల్పపీడనంగా బలహీనపడింది. ప్రస్తుతం ఇది ఆగ్నేయ రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉండి, దీని ప్రభావం తెలంగాణపై పెద్దగా ఉండబోదని అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ నైరుతి రుతుపవనాల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు పడే సూచనలు ఉన్నాయని స్పష్టం చేశారు.
తెలంగాణలోని 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలో రాగల మూడు రోజుల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 18 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, జనగాం, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ వంటి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశముంది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద నిలబడకూడదని సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు జిల్లాల్లో మోస్తరు వర్ష సూచన
ఇటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్ష ప్రభావం కొనసాగుతుందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం రోజున తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. వర్షాల కారణంగా ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఉప్పొంగుతున్న గోదావరి
మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం ఏకంగా 56 అడుగులకు చేరుకోవడంతో వరద తీవ్రత విపరీతంగా పెరిగింది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు మరియు లోతట్టు ప్రాంతాల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు, కాలువలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.




