Deepam Scheme : ఏపీ మహిళలకు చంద్రబాబు బంపర్ ఆఫర్.. పైపుల ద్వారా గ్యాస్ వచ్చినా దీపం సబ్సిడీ పక్కా
Deepam Scheme : ఏపీలోని మధ్యతరగతి, పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో తీపి కబురు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దీపం పథకం పరిధిని మరింత విస్తరిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Deepam Scheme AP 2026
Deepam Scheme : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం పథకం ద్వారా అర్హులైన పేదలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా చాలా నగరాల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సిలిండర్ల నుంచి పీఎన్‌జీకి మారే లబ్ధిదారులు తమ రాయితీని కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. వారి భయాన్ని పోగొడుతూ సీఎం చంద్రబాబు సంచలన ఆదేశాలు ఇచ్చారు. లబ్ధిదారులు పీఎన్‌జీ కనెక్షన్‌లోకి మారినప్పటికీ, వారికి అందాల్సిన మూడు ఉచిత సిలిండర్ల సమాన రాయితీ సొమ్మును నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
లక్ష్యం 10 లక్షల కనెక్షన్లు
రాష్ట్రంలో గ్యాస్ సరఫరా వ్యవస్థను ఆధునీకరించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. వచ్చే ఆరు నెలల కాలంలోనే 10 లక్షల కొత్త పీఎన్‌జీ కనెక్షన్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందులో భాగంగా శ్రీకాకుళం-కాకినాడ సహజవాయువు పైప్‌లైన్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టుపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో సీఎం ఫోన్లో మాట్లాడారు. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి, పనుల పురోగతిపై త్వరలోనే రివ్యూ నిర్వహిస్తామని హామీ ఇచ్చింది.
అర్హులు ఎవరు? కండిషన్స్ ఏంటి?
ఈ పథకం ప్రధానంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న పేద కుటుంబాలకు వర్తిస్తుంది. ప్రతి నాలుగు నెలలకు ఒక ఉచిత సిలిండర్ చొప్పున ఏడాదికి మూడు పొందవచ్చు. గ్యాస్ బుక్ చేసుకుని డెలివరీ అయిన 48 గంటల్లోనే నగదు ఖాతాలో జమ అవుతుంది. అయితే, ఈ డబ్బులు మీ ఖాతాలోకి రావాలంటే ఈ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. కేవైసీ పూర్తి కాని వారికి సబ్సిడీ జమ కావడంలో ఇబ్బందులు తలెత్తుతాయని ప్రభుత్వం హెచ్చరించింది. కావున లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా ఆన్ లైన్ లో లేదా గ్యాస్ ఏజెన్సీ వద్ద కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలి.
నమ్మకమైన పంపిణీ వ్యవస్థ
గ్యాస్ పంపిణీలో ఎక్కడా అవకతవకలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. పారదర్శకత కోసం డిజిటల్ పేమెంట్స్, ఆధార్ సీడింగ్ ను పక్కాగా అమలు చేస్తోంది. ప్రతి ఏటా ఒకసారి కేవైసీ ధృవీకరణ చేసుకోవడం వల్ల అనర్హుల ఏరివేత జరిగి, అసలైన పేదలకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. చంద్రబాబు తాజా నిర్ణయంతో పట్టణ ప్రాంతాల్లో పీఎన్‌జీ వాడుతున్న పేదలకు కూడా పెద్ద ఊరట లభించినట్లయింది.




