AP Governance : ఒక్క మెసేజ్‌తో ఓటర్ కార్డు నుంచి బర్త్ సర్టిఫికేట్ వరకు.. ఏపీలో టెక్నాలజీ విప్లవం
AP Governance : ఏపీ సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్ పై కీలక సమీక్ష నిర్వహించారు. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 1000కి పైగా సేవలు, కర్నూలు డ్రోన్ సిటీ డెడ్ లైన్, సీసీ కెమెరాల అనుసంధానంపై కీలక ఆదేశాలు జారీచేశారు.
Chandrababu Naidu
AP Governance : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనను మరింత వేగవంతం చేసేందుకు, టెక్నాలజీని సామాన్యుడి ముంగిట నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరికొత్త వ్యూహాలతో దూసుకుపోతున్నారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) పనితీరుపై ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. "ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగడం కాదు.. పాలనే ప్రజల వద్దకు వెళ్లాలి" అనే నినాదంతో మిత్ర వాట్సప్ గవర్నెన్స్‌ను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. డ్రోన్ సిటీ నిర్మాణం నుంచి నేర నియంత్రణ వరకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసిన ముఖ్యాంశాలు ఇవే..
వాట్సప్ గవర్నెన్స్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెక్నాలజీ ప్రియుడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే టెక్నాలజీని సామాన్యుడికి ఉపయోగపడేలా మిత్ర (MITRA) వాట్సప్ గవర్నెన్స్‌ను విస్తరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా 1,035 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 54 లక్షల మంది ప్రజలు ఏకంగా 1.78 కోట్ల సేవలను దీని ద్వారా పొందడం విశేషం. కేవలం సేవలు అందించడమే కాకుండా, వీటిని ఎలా వాడాలో ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే 24 లక్షల మందికి అవగాహన కల్పించినట్లు అధికారులు వివరించారు.
కర్నూలు డ్రోన్ సిటీ
కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న డ్రోన్ సిటీ ప్రాజెక్టుపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. మాస్టర్ ప్లాన్ ఇప్పటికే ఖరారయ్యిందని, మొదటి దశ అభివృద్ధి పనులు జూలై నాటికి పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఇప్పటికే 8 ప్రముఖ కంపెనీలకు భూముల కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యింది. మే నెల రెండో వారంలో ఈ కంపెనీలు తమ యూనిట్ల ఏర్పాటుకు గ్రౌండ్ లెవల్ పనులు మొదలుపెట్టనున్నాయి. డ్రోన్ తయారీలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నెంబర్ వన్ గా నిలపాలన్నది చంద్రబాబు సంకల్పం.
నేర నియంత్రణలో థర్డ్ ఐ పవర్
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం సీసీ టీవీ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేయాలని సీఎం సూచించారు. కేవలం ప్రభుత్వ కెమెరాలే కాకుండా, ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల డేటాను కూడా ప్రభుత్వ వ్యవస్థతో అనుసంధానం చేయాలని ఆదేశించారు. దీనివల్ల వాహనాల దొంగతనాలు, మిస్సింగ్ కేసులు, నేరగాళ్ల కదలికలను ఇట్టే పసిగట్టవచ్చు. ఏపీ ఇప్పటికే మిస్సింగ్ కేసుల ట్రేసింగ్‌లో దేశంలోనే ముందు వరుసలో ఉండటం గమనార్హం.
శాటిలైట్ డేటా - ప్రకృతి వైపరీత్యాలకు చెక్
ఇటీవల శేషాచలం అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపించినప్పుడు స్పందించిన తీరును ప్రస్తావిస్తూ.. శాటిలైట్ సమాచారాన్ని ఆర్టీజీఎస్కు అనుసంధానించాలని సీఎం చెప్పారు. అంతరిక్షం నుంచి అందే సమాచారం ద్వారా ఎక్కడ అడవి మంటలు వచ్చినా, వరదలు పొంచి ఉన్నా క్షణాల్లో గుర్తించి ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే పెట్రోల్, డీజిల్ సరఫరాలో చిన్న సమస్య తలెత్తినా ప్రభుత్వం తక్షణమే స్పందించిందని, భవిష్యత్తులో సమస్య రాకముందే రియల్ టైమ్ లో అప్రమత్తంగా ఉండాలని అధికారులను దిశానిర్దేశం చేశారు.




