Cyber Crime : 652 కోట్లు, 9 లక్షల మంది బాధితులు, 9.29 లక్షల ఫిర్యాదులు.. ఏపీలో రెచ్చిపోతున్న సైబర్ కేటుగాళ్లు
Cyber Crime : ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పటివరకు 9 లక్షల మంది రూ.652 కోట్లు కోల్పోయారు.
Cyber Crime
Cyber Crime : ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరగాళ్లు నిశ్శబ్ద యుద్ధం ప్రకటిస్తున్నారు. అమాయక ప్రజల ఆశలను, అవసరాలను ఆసరాగా చేసుకుని కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. కేవలం ఒక చిన్న ఫోన్ కాల్, ఒక ఆకర్షణీయమైన మెసేజ్ లేదా వాట్సాప్‌లో వచ్చే అనుమానాస్పద లింక్.. ఇలా ఏ రూపంలోనైనా వచ్చి మన బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. తాజా గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 9 లక్షల మంది ఈ సైబర్ మాయగాళ్ల ఉచ్చులో పడి విలవిలలాడుతున్నారు. సామాన్య కూలీల నుంచి పెద్ద పెద్ద వ్యాపారవేత్తల వరకు ఎవరినీ ఈ దొంగలు వదలడం లేదు.
అక్షరాలా 652 కోట్లు మాయం
ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం.. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఇప్పటివరకు 9.29 లక్షల ఫిర్యాదులు అందాయి. ఈ బాధితులు పోగొట్టుకున్న మొత్తం అక్షరాలా రూ.652 కోట్లు. ఇందులో ఊరట కలిగించే విషయం ఏమిటంటే.. సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం బ్యాంకర్లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ సుమారు రూ.116 కోట్లను రికవరీ చేసి బాధితులకు తిరిగి ఇప్పించగలిగింది. మిగిలిన సొమ్మును వెలికితీసేందుకు ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అహోరాత్రులు శ్రమిస్తున్నాయి.
మోసాల తీరు మారుతోంది.. ఇవే కొత్త ట్రెండ్స్
గతంలో కేవలం ఓటీపీలు అడిగి మోసం చేసేవారు. కానీ ఇప్పుడు రూటు మార్చారు. పెట్టుబడి పెడితే లక్షలు వస్తాయనే ఆశ చూపడం, తక్కువ వడ్డీకే ఆన్‌లైన్ లోన్లు ఇస్తామనడం, లేదా ఎవరైనా కొరియర్ పంపారంటూ బెదిరించడం వంటివి చేస్తున్నారు. ఇటీవల డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రముఖులను సైతం గృహనిర్బంధం చేస్తున్నట్లు భ్రమింపజేసి లక్షల రూపాయలు గుంజుతున్నారు. క్రెడిట్, డెబిట్ కార్డుల డేటాను దొంగిలించి షాపింగ్ చేయడం వంటి పిషింగ్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి.
యాక్షన్ ప్లాన్‌తో సిద్ధం కావాలి: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెరుగుతున్న ఈ సైబర్ నేరాల తీవ్రతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సైబర్ నేరం జరిగిన వెంటనే అంటే గోల్డెన్ అవర్‌లో స్పందించడం చాలా కీలకమని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే ఆ డబ్బు ఇతర ఖాతాలకు వెళ్లకుండా ఫ్రీజ్ చేసే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. ఇతరుల బ్యాంక్ ఖాతాలను అద్దెకు తీసుకుని మోసాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బ్యాంకర్లతో నిరంతరం టచ్‌లో ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.
మూడు ప్రాంతాల్లో స్పెషల్ స్టేషన్లు
రాష్ట్రవ్యాప్తంగా సైబర్ నేరాలను అరికట్టేందుకు సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ యూనిట్లు పనిచేస్తున్నాయని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో అత్యాధునిక సాంకేతికతతో కూడిన సైబర్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, హోంశాఖ కార్యదర్శి, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నేరం జరిగితే ఏం చేయాలి?
మీరు పొరపాటున ఏదైనా లింక్ క్లిక్ చేసి డబ్బులు కోల్పోతే, ఆలస్యం చేయకుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి. లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయండి. ఎంత త్వరగా స్పందిస్తే డబ్బు వెనక్కి వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. గుర్తుంచుకోండి.. బ్యాంక్ అధికారులు ఎప్పుడూ మీ వ్యక్తిగత వివరాలు లేదా ఓటీపీలు ఫోన్‌లో అడగరు.




