Chandrababu: పెద్దాయన అమాయకత్వానికి ఫిదా అయిన సీఎం.. ‘సత్యనారాయణ గారూ రేపు కలుద్దాం’ అంటూ చంద్రబాబు ట్వీట్!

Chandrababu: సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వృద్ధుడి అమాయకపు వీడియోపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.

Arun Chilukuri
Published on: 7 Jun 2026 2:28 PM IST
Chandrababu
X

Chandrababu: పెద్దాయన అమాయకత్వానికి ఫిదా అయిన సీఎం.. ‘సత్యనారాయణ గారూ రేపు కలుద్దాం’ అంటూ చంద్రబాబు ట్వీట్!

Chandrababu: సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన ఒక హృద్యమైన వీడియోపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి, తన పెద్ద మనసును చాటుకున్నారు. ఒక సామాన్య వృద్ధుడైన అభిమాని కోరికను తీర్చడానికి ఆయన తక్షణమే ముందుకొచ్చారు. తనను కలవాలని ఆశగా ఎదురుచూస్తున్న సదరు పెద్దాయనను ఉద్దేశించి, "సత్యనారాయణ గారూ.. రేపు సిద్ధాంతంలో కలుద్దాం" అని సీఎం చంద్రబాబు తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) వేదికగా శుక్రవారం ఒక క్రేజీ పోస్ట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వృద్ధుడితో ఒక స్థానిక యువకుడు మాట్లాడిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యింది. ఆ వీడియోలో సదరు యువకుడు.. "చంద్రబాబును ఎప్పుడైనా చూశారా తాతా?" అని అడగ్గా, ఆ పెద్దాయన ఎంతో అమాయకంగా.. "ఆయన హైదరాబాద్‌లో ఉంటారని అంటారు బాబూ, నేనైతే ఇప్పటివరకు ఎప్పుడూ నేరుగా చూడలేదు" అని బదులిచ్చారు.

వెంటనే ఆ యువకుడు.. "మరి ఆయన్ను చూడాలని, కలవాలని ఉందా?" అని ప్రశ్నించగా.. సత్యనారాయణ గారు ఎంతో ఉత్సాహంగా, ఎలాగైనా ఒకసారి చూడాలనే కోరిక బలంగా ఉందని చెప్పారు. దీంతో ఆ యువకుడు చొరవ తీసుకుని.. ఈ నెల 9న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘సిద్ధాంతం’ గ్రామానికి వస్తున్నారని, తాను తప్పకుండా అక్కడ సీఎంను కలిసేలా చేస్తానని తాతకు హామీ ఇచ్చారు. ఆ మాట వినగానే సత్యనారాయణ గారి ముఖంలో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఈ భావోద్వేగ భరితమైన వీడియో కాస్తా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి చేరింది. దీనిపై తక్షణమే స్పందించిన ఆయన, పెద్దాయన అమాయకత్వానికి, అభిమానానికి ముగ్ధుడై.. తానే స్వయంగా నేరుగా ఆయన్ను కలుస్తానని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. సిద్ధాంతంలో తన పర్యటన సందర్భంగా సత్యనారాయణ గారిని ప్రత్యేకంగా కలవనున్నట్లు సీఎం చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఒక సామాన్యుడి కోరికకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత వేగంగా స్పందించి అపాయింట్‌మెంట్ ఇవ్వడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story