AP Cabinet Meeting: సచివాలయంలో ఏపీ కేబినెట్.. 25కు పైగా కీలక అంశాలపై చర్చ
AP Cabinet Meeting: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది.
AP Cabinet Meeting: సచివాలయంలో ఏపీ కేబినెట్.. 25కు పైగా కీలక అంశాలపై చర్చ
AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఉద్యోగాల భర్తీకి సంబంధించి దాదాపు 25కు పైగా కీలక అజెండా అంశాలపై ముఖ్యమంత్రి, అమాత్యులు విస్తృతంగా చర్చించనున్నారు.
ఈ సమావేశంలో నిరుద్యోగులకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో రెండో దశ కింద 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. దీనికితోడు చేనేత కార్మికులను ఆదుకునే లక్ష్యంతో ‘నేతన్న భరోసా’ పథకం కింద ప్రతి కుటుంబానికి రూ.25,000 చొప్పున ఆర్థిక సాయం అందించే ప్రతిపాదనపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది.
బాపట్ల జిల్లా వెదుళ్లపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు ప్రతిపాదనపై చర్చించనున్నారు. శ్రీకాకుళంలో బ్రహ్మకుమారీస్ సంస్థకు కేటాయించిన మున్సిపల్ స్థలం లీజును కొనసాగించడంపై నిర్ణయం తీసుకోనున్నారు.
15వ ఆర్థిక సంఘం నిధులను ఉపయోగించి అగ్నిమాపక శాఖకు కొత్త వాహనాలు, ఆధునిక పరికరాల కొనుగోలుకు సంబంధించి కేబినెట్ అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం కేబినెట్ తీసుకున్న ముఖ్యాంశాలు, ఆమోదించిన ప్రతిపాదనల వివరాలను ప్రభుత్వం అధికారికంగా మీడియాకు వెల్లడించనుంది.




