AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ బంపర్ ఆఫర్.. ఆ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు!
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ బంపర్ ఆఫర్.. ఆ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు!
AP Cabinet Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ (Cabinet) సమావేశం ముగిసింది. సుమారు మూడు గంటల పాటు అత్యంత సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగుల ప్రయోజనాలే లక్ష్యంగా పలు చారిత్రాత్మక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. కేబినెట్ ఆమోదం తెలిపిన ఆ ముఖ్యమైన అంశాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
1. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు:
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ ప్రభుత్వరంగ సంస్థలు (PSUs), సొసైటీలు, కార్పొరేషన్లు మరియు గురుకుల పాఠశాలలు/కళాశాలల్లో పని చేస్తున్న ఉద్యోగులకు కేబినెట్ తీపి కబురు అందించింది. వీరందరి పదవీ విరమణ వయసును (Retirement Age) 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకుంది.
2. ‘అమరావతి ఐ’ ప్రాజెక్టు & సాగునీటి రంగానికి ఊతం:
కృష్ణా నదీ తీరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన ‘అమరావతి ఐ’ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ‘ఆంధ్రప్రదేశ్ రిజర్వాయర్ల కేజ్ కల్చర్ పాలసీ-2025’ ముసాయిదాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా తొలి దశలో మడ్డువలస, ఏలేరు రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. పోలవరం సహా రాష్ట్రంలోని ఇతర ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతి కోసం పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది.
3. పారిశ్రామిక, ఏవియేషన్ రంగానికి బూస్ట్:
రాష్ట్రంలో విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రూపొందించిన నూతన ‘ఏపీ ఏవియేషన్ పాలసీ-2026’కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కేటాయించిన భూముల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి పూర్తి మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, సంస్థల స్థాపన కోసం పలు ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలకు భూములు కేటాయించేందుకు మంత్రివర్గం అంగీకరించింది.
4. టూరిజం & ఎక్సైజ్ పాలసీలో మార్పులు:
రాష్ట్రంలో పర్యాటకాన్ని (Tourism) అభివృద్ధి చేయడంలో భాగంగా విశాఖపట్నం, చీరాల బీచ్‌లలో గోవా తరహాలో ‘బీచ్ షాక్స్’ ఏర్పాటుకు వీలుగా ఎక్సైజ్ పాలసీ మార్గదర్శకాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
5. ఇతర ముఖ్య నిర్ణయాలు:
మానవ అవయవాల మార్పిడి చట్టం ఈ చట్టాన్ని రాష్ట్రంలో మరింత కఠినంగా అమలు చేసేందుకు వీలుగా కొత్త ఆర్డినెన్స్ జారీ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హడ్కో (HUDCO) సంస్థ నుంచి రూ. 300 కోట్ల రుణం సేకరించేందుకు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం గ్యారెంటీ (హామీ) ఇచ్చింది. రాష్ట్రంలో జులై 1వ తేదీ నుంచి వీబీ-జీ-రాంజీ విధానాన్ని అమలు చేయడానికి మంత్రివర్గం తుది ఆమోదముద్ర వేసింది.




