ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సీరియస్: బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు.. అధికారులకు కీలక ఆదేశాలు!
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సీరియస్: బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు.. అధికారులకు కీలక ఆదేశాలు!
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో కృత్రిమ కొరత సృష్టించినా లేదా ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్‌లో విక్రయించినా సహించేది లేదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు. ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు.
ఇంధన సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రతి మూడు గంటలకు ఒకసారి క్షేత్రస్థాయి నివేదికను తనకు సమర్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆయిల్ కంపెనీలు (HPCL, BPCL, IOCL) యుద్ధ ప్రాతిపదికన పనిచేసి అన్ని బంకుల్లో నిల్వలు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. "రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా 'నో స్టాక్' (No Stock) బోర్డులు కనిపించకూడదు" అని ఆయన తేల్చి చెప్పారు.
సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తల వల్ల ప్రజలు భయాందోళనకు గురై పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారని, దీనివల్ల డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని అధికారులు సీఎంకు వివరించారు. సాధారణంగా రోజుకు 6,330 KL పెట్రోల్ అమ్ముడవుతుండగా, శనివారం అది 10,345 KL కు పెరిగింది. అలాగే డీజిల్ అమ్మకాలు 9,048 KL నుంచి 14,156 KL కు పెరిగాయి. ప్రైవేట్ ఆపరేటర్లు (Nayara, Reliance) సరఫరా నిలిపివేయడం, ఆయిల్ కంపెనీలు క్రెడిట్ సౌకర్యం ఆపేయడం వల్ల ఈ సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు.
సీఎం ఆదేశాల మేరకు, ఆయిల్ కంపెనీలతో సమన్వయం చేసుకుని సోమవారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ ప్రాంతాల్లో ఇంధన సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని అధికారులు ధీమా వ్యక్తం చేశారు. ప్రతి బంకు వద్ద సీసీటీవీ పర్యవేక్షణ మరియు పోలీసు బందోబస్తు ఉండాలని సీఎం ఆదేశించారు.




