Shocking News: అది కడుపా కిరాణా కొట్టా.. పెన్నులు, చెంచాలు, కొవ్వొత్తులు.. ఇవ్వన్నీ ఎలా మింగావమ్మా ?

Shocking News: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో విస్తుపోయే ఘోరం వెలుగులోకి వచ్చింది.

CR Reddy
Published on: 7 Sept 2026 7:29 AM IST
woman stomach
X

woman stomach

Shocking News: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో విస్తుపోయే ఘోరం వెలుగులోకి వచ్చింది. తీవ్రమైన ఛాతీ, కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఒక మహిళకు వైద్య పరీక్షలు చేయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆమె పొట్టలో ఏకంగా 14 పెన్నులు, ఐదు చెక్క చెంచాలు, ఒక కొవ్వొత్తి ఉన్నట్లు గుర్తించి డాక్టర్లు సైతం అవాక్కయ్యారు. పల్నాడు జిల్లా పెట్లూరివారిపాలెం గ్రామానికి చెందిన 33 ఏళ్ల వివాహిత గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఛాతీ నొప్పితో అల్లాడిపోతోంది. నొప్పి భరించలేక నరకయాతన అనుభవిస్తున్న ఆమెను కుటుంబ సభ్యులు శనివారం నరసరావుపేట పట్టణంలోని మాతాశ్రీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు ప్రాథమిక తనిఖీలు నిర్వహించగా, కడుపులో అసాధారణమైన లోహపు, ప్లాస్టిక్ వస్తువులు ఉన్నట్లు ఎక్స్‌రే, స్కాన్ నివేదికల్లో స్పష్టమైంది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిపుణుల బృందం రంగంలోకి దిగి మరింత లోతుగా పరీక్షలు జరిపింది.

లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సతో వస్తువుల తొలగింపు

మహిళ ప్రాణాపాయ స్థితిని గుర్తించిన వైద్యులు వెంటనే అత్యవసర శస్త్రచికిత్సకు నిర్ణయం తీసుకున్నారు. కడుపు భాగంలో చిన్న రంధ్రం చేసి లాప్రోస్కోపిక్ విధానంలో అత్యంత జాగ్రత్తగా ఆపరేషన్ నిర్వహించారు. పొట్ట నుంచి ఒక్కొక్కటిగా 14 పెన్నులు, 5 చెక్క స్పూన్లు, ఒక కొవ్వొత్తిని విజయవంతంగా బయటకు తీశారు. బయటకు తీసిన ఒక పెన్నుకు ప్లాస్టిక్ క్యాప్ లేకపోవడంతో అది కడుపు లోపలి భాగంలో గుచ్చుకుని విపరీతమైన నొప్పిని కలిగించిందని డాక్టర్లు తెలిపారు. ఒకేసారి ఇన్ని వస్తువులను మనిషి ఎలా మింగగలిగిందో ఊహించడం కూడా కష్టంగా ఉందని శస్త్రచికిత్స చేసిన వైద్య బృందం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

పదేళ్లుగా మానసిక సమస్యలు

ఈ అసాధారణ ఘటన వెనుక ఉన్న విషాద కోణాన్ని బాధితురాలి తండ్రి నోముల హనుమంతరావు వెల్లడించారు. తన కుమార్తె గత పదేళ్ల కాలం నుంచి మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని ఆయన కంటినీరు పెట్టుకున్నారు. ఈ సమస్య కారణం చేత ఆమె ప్రవర్తనలో తరచుగా అనేక మార్పులు వచ్చేవి. దీనికి తోడు కేవలం రెండు నెలల క్రితమే ఆమె భర్త విడాకులు ఇవ్వడంతో మనస్తాపానికి గురై తీవ్రమైన మానసిక కుంగుబాటులోకి వెళ్ళిపోయిందని తెలిసింది. ఈ మానసిక ఒత్తిడిలోనే ఆమె ఇల్లంతా ఉన్న వస్తువులను మింగేసి ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

క్రమంగా కోలుకుంటున్న బాధితురాలు

వైద్యుల నిరంతర శ్రమతో ఆపరేషన్ విజయవంతం కావడంతో బాధితురాలు ప్రస్తుతానికి ప్రమాదం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తి నిలకడగా ఉందని, వేగంగా కోలుకుంటోందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే శస్త్రచికిత్స తర్వాత ఆమెకు శారీరక చికిత్సతో పాటు మానసిక ఆరోగ్య నిపుణుల పర్యవేక్షణ, కౌన్సిలింగ్ అత్యంత అవసరమని వైద్యులు తేల్చి చెప్పారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story