Amaravati: అమరావతిలో చారిత్రాత్మక ఘట్టం.. సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిలు నేడే ప్రారంభం
Amaravati: రాజధానికి అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు రెండు భారీ స్టీల్ బ్రిడ్జిలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు లాంఛనంగా ప్రారంభించనున్నారు.
Amaravati Seed Access Road
Amaravati: అమరావతి నివాసుల దశాబ్దాల కలకు మరో పటిష్టమైన అడుగు పడింది. రాజధాని నగరానికి ఊపిరిలాంటి సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ప్రారంభించబోతున్నారు. ఈ రహదారితో పాటు ప్రజాప్రతినిధుల కోసం నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను కూడా అధికారికంగా సాధారణ పరిపాలన విభాగానికి (జీఏడీ) అప్పగించనున్నారు. ఒకే రోజు కీలక అభివృద్ధి ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తుండటంతో రాజధాని పరిధిలోని గ్రామాల ప్రజల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.
రాజధాని జీవనాడి.. 9 లేన్ల అద్భుత నిర్మాణం
అమరావతి రోడ్ల అనుసంధానంలో సీడ్ యాక్సెస్ రోడ్డు అత్యంత కీలకంగా మారనుంది. మొత్తం 21.77 కిలోమీటర్ల పొడవునా 9 లేన్ల విశాలమైన రహదారిగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. రోడ్డు మధ్యలో ప్రత్యేకం బీఆర్టీఎస్ కారిడార్‌తో పాటు ఇరువైపులా 11 మీటర్ల వెడల్పుతో సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేశారు. రాజధానిలో ఉత్తరం నుంచి దక్షిణం వైపు ప్రయాణించే ఎన్-1 నుంచి ఎన్-17 వరకు ఉన్న ప్రధాన రహదారులన్నీ ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకే అనుసంధానం కావడం విశేషం.
రెండు భారీ స్టీల్ బ్రిడ్జిల ఆవిష్కరణ
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మొత్తం మూడు దశల్లో విస్తరిస్తున్నారు. దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు మొదటి దశ పనులు పూర్తి చేసుకోగా, రెండవ దశలో భాగంగా నిర్మించిన రెండు బ్రిడ్జిలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఉండవల్లి వద్ద బకింగ్‌హామ్ కాలువపై 110 మీటర్ల పొడవునా, అలాగే కొండవీటి వాగుపై 280 మీటర్ల మేర నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను సీఎం ఈరోజు జాతికి అంకితం చేయనున్నారు. ఈ రహదారి దొండపాడు నుంచి తాడేపల్లి వద్ద ఉన్న జాతీయ రహదారి-16ను నేరుగా అనుసంధానిస్తుంది.
ప్రజాప్రతినిధుల క్వార్టర్స్ అప్పగింత
సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా రాయపూడి వరకు పర్యటించనున్న ముఖ్యమంత్రి, అక్కడ శరవేగంగా పూర్తయిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ తాళాలను అధికారుల నుంచి అందుకుంటారు. అనంతరం వాటిని జీఏడీకి హ్యాండోవర్ చేస్తారు. ప్రజాప్రతినిధులతో పాటు అధికారుల నివాసాలు అందుబాటులోకి రావడం వల్ల రాజధాని ప్రాంతంలో పాలనా కార్యకలాపాలు మరింత వేగవంతం కానున్నాయి.




