Independence Day: గుండెల్లో అజెండా ఉండాలి: అమరావతి వేడుకల్లో సీఎం చంద్రబాబు
Independence Day: అమరావతి రాయపూడి పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.
Independence Day: గుండెల్లో అజెండా ఉండాలి: అమరావతి వేడుకల్లో సీఎం చంద్రబాబు
Independence Day: "మన చేతిలో జాతీయ జెండా ఉండాలి.. మన గుండెల్లో దేశం కోసం బలమైన అజెండా ఉండాలి" అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలోని రాయపూడి పరేడ్ మైదానంలో తొలిసారిగా నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరై, ఘనంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ప్రత్యేక బుల్లెట్ ఎస్కార్ట్‌తో వేడుకల ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మరియు ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, పరేడ్ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరంలో తెలుగు నేల తనదైన ముద్ర వేసిందని గుర్తుచేశారు. ఎందరో మహనీయుల పోరాటాలు, త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యమని కొనియాడారు. వారి త్యాగాలకు నిజమైన నివాళి అర్పించడమంటే దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమేనని అన్నారు.
"దేశం మనకు హక్కులు, గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చింది. 'దేశం నాకు ఏం చేసింది' అని కాకుండా... 'దేశానికి నేను ఏం చేయగలను' అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నా దేశం.. నా బాధ్యత అనే భావనతో ముందుకు సాగాలి" అని సీఎం పిలుపునిచ్చారు.
2047 నాటికి 'వికసిత్ భారత్' మరియు 'స్వర్ణాంధ్ర' లక్ష్యాలను సాకారం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తి చేసుకునే నాటికి మన దేశం, రాష్ట్రం సమృద్ధి వైపు, వైభవం వైపు అడుగులు వేయాలని ఆకాంక్షించారు. ఈ సమున్నత లక్ష్యంలో ఏపీ ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ భాగస్వాములు కావాలని, అందరం ఐక్యంగా ముందుకు సాగుదామని సీఎం చంద్రబాబు కోరారు.




