Beeda Masthan Rao: మత్స్యకార బిల్లుకు రాష్ట్రపతి ఓకే!

Beeda Masthan Rao: దేశవ్యాప్త మత్స్యకారుల సంక్షేమం కోసం ఎంపీ బీద మస్తాన్ రావు యాదవ్ ప్రవేశపెట్టిన 'నేషనల్ కమిషన్ ఫర్ ఫిషర్‌మెన్ బిల్, 2025' కు భారత రాష్ట్రపతి సిఫార్సు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 April 2026 12:28 PM IST
Beeda Masthan Rao
X

Beeda Masthan Rao: మత్స్యకార బిల్లుకు రాష్ట్రపతి ఓకే!

Beeda Masthan Rao: దేశవ్యాప్తంగా మత్స్యకారుల సంక్షేమం, భద్రత, అభివృద్ధి మరియు హక్కుల పరిరక్షణ కోసం రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ ప్రవేశపెట్టిన “నేషనల్ కమిషన్ ఫర్ ఫిషర్‌మెన్ (వెల్ఫేర్ అండ్ సపోర్ట్) బిల్, 2025” కు భారత రాష్ట్రపతి సిఫార్సు లభించడం ఒక ముఖ్యమైన రాజ్యాంగపరమైన ముందడుగని రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు యాదవ్ పేర్కొన్నారు.

ఈ బిల్లును తాను 2026 ఫిబ్రవరి 6న రాజ్యసభలో ప్రవేశపెట్టినట్లు, దానికి సంబంధించి భారత రాష్ట్రపతి రాజ్యాంగంలోని Article 117(3) ప్రకారం పరిశీలనకు సిఫార్సు చేసినట్లు రాజ్యసభ కార్యదర్శిత్వం నుంచి అధికారిక సమాచారం అందినట్లు ఆయన తెలిపారు.

దేశంలో కోట్లాది మంది మత్స్యకార కుటుంబాలు సముద్రం, చెరువులు, నదులు, జలాశయాలపై ఆధారపడి జీవిస్తున్నప్పటికీ, వారి సమస్యలు, సంక్షేమం, భద్రత, జీవనోపాధి, మార్కెటింగ్, సామాజిక భద్రత, ప్రమాద బీమా, పిల్లల విద్య, మహిళల ఉపాధి, వృత్తి ఆధునీకరణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించే ఒక జాతీయ స్థాయి స్వతంత్ర కమిషన్ అవసరం ఎంతోకాలంగా ఉందని బీద మస్తాన్ రావు యాదవ్ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా National Commission for Fishermen ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మత్స్యకారుల సమస్యలను కేవలం రాష్ట్రాల పరిధిలోనే కాకుండా జాతీయ విధాన స్థాయిలో పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

రాష్ట్రపతి సిఫార్సు లభించడం ద్వారా ఈ బిల్లుకు పార్లమెంటరీ ప్రాసెస్‌లో ఒక గౌరవప్రదమైన గుర్తింపు లభించిందని, ఇది దేశవ్యాప్తంగా మత్స్యకార సమాజానికి ఒక ఆశాకిరణం అని ఎంపీ పేర్కొన్నారు. మత్స్యకారుల అభ్యున్నతికి, వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు, వృత్తి పరిరక్షణకు, భవిష్యత్ తరాలకు భద్రత కల్పించేందుకు ఈ బిల్లు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా ఉన్న మత్స్యకార సంఘాలు, వృత్తిదారులు, మహిళలు, యువత, ప్రజాప్రతినిధులు ఈ బిల్లుకు మద్దతు తెలపాలని, మత్స్యకారుల హక్కుల కోసం తాను పార్లమెంట్ వేదికగా నిరంతరం పోరాడుతూనే ఉంటానని బీద మస్తాన్ రావు యాదవ్ స్పష్టం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story