Nellore: ప్రజా సంక్షేమ బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్
Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 492.76 కోట్ల అంచనా బడ్జెట్‌ను మేయర్ దేవరకొండ సుజాత అశోక్ ప్రవేశపెట్టారు.
Nellore: ప్రజా సంక్షేమ బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్
Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించేలా. నూతన బడ్జెట్ రూపొందించామని కార్పొరేషన్ గౌరవ మేయర్ దేవరకొండ సుజాత అశోక్ ప్రకటించారు. నగర పాలక సంస్థ సర్వసభ్య వార్షిక బడ్జెట్ ప్రత్యేక సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్. ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ కౌన్సిల్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు.
మేయర్ దేవరకొండ సుజాత అశోక్ అధ్యక్షతన 2026-27 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు ప్రారంభ నిల్వ రూ. 126,40,60,239 కోట్ల రూపాయలతో, జమలు రూ. 366,35,92,000 కోట్లతో కలిపి మొత్తం రూ. 492,76,52,239 కోట్లు జమలు గా ప్రతిపాదించి దానికి అనుగుణంగా రూ.473,31,30,000 కోట్ల రూపాయల ఖర్చులను అంచనా వేసి బడ్జెట్ ను ప్రవేశపెట్టి, సర్వసభ్యుల ఆమోదమును కౌన్సిల్ తీర్మానం ద్వారా ఆమోదించారు.
సమావేశాన్ని ప్రారంభించిన అనంతరం మేయర్ మాట్లాడుతూ. నెల్లూరు నగరపాలక సంస్థ బడ్జెట్ ప్రత్యేక సమావేశానికి విచ్చేసిన డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్, సయ్యద్ తహసీన్ ఇంతియాజ్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, కార్పొరేషన్ అన్ని విభాగాల అధికారులకు అభివాదం తెలిపారు.
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టవలసిన సంక్షేమ అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తిస్థాయిలో అందరు ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలతో, అనుభవజ్ఞుల సహకారంతో, నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో రూపొందించి ప్రణాళికబద్ధంగా అమలు చేయబోతున్నట్లు మేయర్ ప్రకటించారు.
రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్ పి.నారాయణ, రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ల ఆలోచనలు, సహకారంతో నెల్లూరు నగరపాలక సంస్థను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన బడ్జెట్ రూపకల్పనకు వారందరితో ప్రత్యేకంగా సంప్రదించి వారి సలహాలు, సూచనలను తీసుకున్నామని వెల్లడించారు.
నగర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు నూతన బడ్జెట్ ను ప్రణాళికాబద్ధంగా కేటాయించామని మేయర్ తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నగర పాలక సంస్థ బడ్జెట్ కేటాయింపులు చేపట్టామని, సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధిని చూపేందుకు బడ్జెట్ ను రూపొందించి కౌన్సిల్ సభ్యుల అందరి సమక్షంలో ఆమోదించామని మేయర్ ప్రకటించారు.
విభాగాల వారీగా రూపొందించిన బడ్జెట్లో నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనులకు ప్రాధాన్యం కల్పిస్తూ కేటాయింపులు జరిపామని, అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ ను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని మేయర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కమిషనర్ వై.ఓ నందన్, వివిధ డివిజనుల కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




