Razole: రాజోలులో చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ సర్టిఫికెట్ల పంపిణీ

Razole: రాజోలు నియోజకవర్గంలో చేనేత కార్మికులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు.

PRABHU, RAZOLE
Published on: 5 April 2026 6:27 PM IST
Razole
X

Razole: రాజోలులో చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ సర్టిఫికెట్ల పంపిణీ

Razole: రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకొంటుంది. చేనేత మరమగ్గాలకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే పథకాన్ని ప్రవేశపెట్టడం ఎంతో సంతోషకరమైన విషయం అని దేవ వరప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కు రాజోలు నియోజకవర్గంలోని చేనేత కార్మికుల తరఫున ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.

రాజోలు నియోజకవర్గంలో మోరి, అడవిపాలెం, తూర్పుపాలెం ప్రాంతాల్లో చేనేత కార్మికులు అధికంగా ఉన్నారని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం చేనేత కార్మికుల పింఛన్‌ను రూ.4,000/కు పెంచడం కూడా వారికి ఎంతో ఉపశమనం కలిగించే చర్య అని తెలిపారు.

అలాగే నియోజకవర్గంలో చేనేత కార్మికులకు సంబంధించిన ఇళ్ల స్థలాల సమస్యపై కూడా ఆయన స్పందించారు. 2009లో ఇచ్చిన సుమారు 315 ఇళ్ల స్థలాల పట్టాలు (వి.వి.మెరక 90, నక్కలపర్రు 225) ఇంకా పూర్తిగా ఉపయోగంలోకి రాకపోవడం బాధాకరమని అన్నారు. ప్రధానంగా అప్రోచ్ రోడ్డు సమస్య వల్ల ఇళ్లు నిర్మించుకోలేని పరిస్థితి ఉందని, దీనిపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి ఒక నెలలో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

అదేవిధంగా కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కూడా పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీసీ యాక్షన్ ప్లాన్ విడుదలైన వెంటనే మలికిపురం, అడవిపాలెం, మోరి ప్రాంతాల్లో ఉన్న కమ్యూనిటీ హాళ్ల పనులను పూర్తి చేయడానికి దృష్టి సారిస్తానని చెప్పారు.

చేనేత కార్మికులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని తమ జీవనోపాధిని మరింత మెరుగుపరుచుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం వారికి ఉచిత విద్యుత్ పథకానికి సంబంధిత సర్టిఫికెట్లు అందచేసారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సోదర సోదరీమణులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story