Kavali: మత్స్యకారులకు అండగా ప్రభుత్వం.. కావలి ఎమ్మెల్యే కీలక ప్రకటన
Kavali: నెల్లూరు జిల్లా కావలి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు.
Kavali: మత్స్యకారులకు అండగా ప్రభుత్వం.. కావలి ఎమ్మెల్యే కీలక ప్రకటన
Kavali: నెల్లూరు జిల్లా,కావలి టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మత్స్యకారుల సమస్యలు,రాష్ట్ర అభివృద్ధి, రాజకీయ పరిణామాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ మత్స్యకారులకు అన్యాయం జరిగితే సహించబోమని స్పష్టం చేశారు. ఈ నెల 17వ తేదీన రాత్రికి రాత్రే బోట్లను తరలించారని, పాండిచ్చేరి ప్రాంతం నుంచి బోట్ల సంచారం అధికమవుతోందని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన హద్దులు దాటుతూ కొన్ని బోట్ల కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
దీంతో స్థానిక మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి బాధను ప్రభుత్వం గమనిస్తోందని చెప్పారు.మత్స్యకారుల రక్షణ కోసం 23 కిలోమీటర్ల పరిధిని దాటి బోట్ల రాకపోకలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, మూడు స్పీడ్ బోట్లతో గస్తీ నిర్వహిస్తున్నామని తెలిపారు. కాకినాడలో ఓ బోటును కొనుగోలు చేసినట్లు, త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు బోట్లను అందుబాటులోకి తీసుకురానున్నారని వెల్లడించారు.
టీడీపీకి మత్స్యకారులతో ప్రత్యేక అనుబంధం ఉందని, గతంలో కూడా వారికి అవసరమైన సహాయం అందించింది అని గుర్తుచేశారు. ఏప్రిల్ 15 నుంచి మత్స్యకారులకు మళ్లీ రూ.20,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ విషయంలో వైసిపి విష ప్రచారం చేస్తోంది. రాష్ట్రానికి, జిల్లాకు ప్రజలకు మేలు జరగకుండా అడ్డుకోవడం, రాజకీయం చేయటమే జగన్మోహన్ రెడ్డి పని. సుమారు 290 కోట్లతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి జరిగింది. ఆధునిక మౌలిక వసతులన్నీ ఏర్పాటయ్యాయి. 1250 చేపల బోట్లను సురక్షితంగా నిలుపుకోవచ్చు.
ప్రతి ఏటా 41 వేల టన్నుల చేపలు దిగుబడిచేసే అవకాశం ఉంది. తద్వారా 25 వేల మత్స్యకార కుటుంబాల జీవితాల్లో గొప్ప మార్పు వస్తుంది.హార్బర్లలో ప్రస్తుతం 11 బోట్లు పనిచేస్తుండగా,రాబోయే రోజుల్లో మరో 40 బోట్లను ప్రభుత్వం అందించనుందని పేర్కొన్నారు.వైసీపీ పార్టీ మత్స్యకారులపై దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించిన ఎమ్మెల్యే, అలాంటి ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులకు బోట్లు కొనుక్కునేందుకు సబ్సిడీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని ప్రతి ఒక్క మత్స్యకారులు వినియోగించుకోవాలని కోరారు.
బోగోలు మండలం తాడిచెట్లపాలెం తీర ప్రాంత అభివృద్ధికి రూ.2 కోట్లను మంజూరు చేసినట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చలు జరుపుతున్నారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో అమరావతి రాజధాని కీలక పాత్ర పోషిస్తుందని, అనేక రాష్ట్రాలు రాజధానుల ఆధారంగా అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు.తెలుగు భాష, సంస్కృతికి ప్రాధాన్యతనిచ్చే ఏకైక పార్టీ టిడిపి అని, ప్రజలకు అన్ని విధాలుగా సేవ చేస్తుందని అన్నారు. అమరావతిని సాధించడంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు పాత్రకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించేందుకు చర్యలు కొనసాగుతాయని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రూరల్ మండలం టిడిపి అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, సోమశిల మాజీ చైర్మన్ కల్లగుంట మధుబాబు నాయుడు, మత్స్యకర నాయకులు నాయకులు, ఏఎంసీ వైస్ చైర్మన్ చెచంగారి శ్రీనివాసులు, వాయిల కనకయ్య, కాటం గారి పోలయ్య,యల్లం గారి తాతయ్య, చిట్టిబాబు,రాము, టిడిపి సీనియర్ నాయకులు దేవకుమార్,టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




