Eluru: ఆ బంధమే శాపమైందా? వివాహితను పెళ్లాడిన యువకుడు.. చివరకు ఊహించని విషాదం!
Eluru: సోషల్ మీడియా పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి, ఆపై ప్రాణాలు తీసుకునే స్థాయికి దారితీసిన విషాద ఘటన ఏలూరు జిల్లాలో వెలుగుచూసింది.
Eluru: ఆ బంధమే శాపమైందా? వివాహితను పెళ్లాడిన యువకుడు.. చివరకు ఊహించని విషాదం!
Eluru: సోషల్ మీడియా పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి, ఆపై ప్రాణాలు తీసుకునే స్థాయికి దారితీసిన విషాద ఘటన ఏలూరు జిల్లాలో వెలుగుచూసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన ప్రేమాయణం ఇద్దరి ఆత్మహత్యతో ముగిసింది. ఈ ఘటనతో అటు యువకుడి కుటుంబంలో తీరని శోకం మిగలగా, ఇటు ఇద్దరు చిన్నారులు తల్లికి దూరమయ్యారు.
అసలేం జరిగిందంటే?
ఉంగుటూరు మండలం నాచుగుంట పంచాయతీ యర్రమళ్లకు చెందిన గుండుగొలను చిన మావుళ్లయ్య (25) చేపల ప్యాకింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా శ్రీకాకుళం జిల్లా సింగుపురానికి చెందిన ఇర్రి రమ (34)తో పరిచయం ఏర్పడింది. రమకు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారి, ఇటీవల రహస్యంగా వివాహం చేసుకున్నారు.
కుటుంబాల మధ్య గొడవ..
విషయం తెలుసుకున్న రమ భర్త, ఆమె తల్లిదండ్రులు యర్రమళ్లకు వచ్చి చిన మావుళ్లయ్య కుటుంబ సభ్యులతో గొడవ పడ్డారు. అనంతరం రమను బలవంతంగా శ్రీకాకుళానికి తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో ఈ నెల 24న చిన మావుళ్లయ్య తన అన్న కుమారుడు సతీష్‌కు ఫోన్ చేసి, రమ తిరిగి వచ్చిందని, ఉంగుటూరులో మాట్లాడదామని పిలిచాడు.
కాలువలో శవాలై తేలారు..
సతీష్ అక్కడికి చేరుకునే సరికి కాలువ గట్టున మావుళ్లయ్య వస్తువులు మాత్రమే కనిపించాయి. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం రాత్రి ఉంగుటూరు వద్ద మావుళ్లయ్య మృతదేహం లభ్యం కాగా, రమ కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావించిన పోలీసులు ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF) బృందాన్ని రంగంలోకి దించారు. గురువారం చేబ్రోలు పోలీస్ స్టేషన్ సమీపంలోని కాలువలో రమ మృతదేహాన్ని కూడా వెలికితీశారు.
కేసు నమోదు చేసుకున్న చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ దర్యాప్తు చేస్తున్నారు. అనాలోచిత నిర్ణయాలతో ఇద్దరు పిల్లలు అనాథలవ్వడం స్థానికులను కలచివేస్తోంది.




