East Godavari: ఖాతీ విధులకు హ్యాట్సాఫ్.. మేరీ మాత వేడుకల్లో పోలీసుల అంకితభావం!
East Godavari: తూర్పు గోదావరి జిల్లా గౌరీపట్నం నిర్మలగిరి మేరీ మాత ఉత్సవాలు లక్షలాది మంది భక్తుల మధ్య అత్యంత వైభవంగా, ప్రశాంతంగా ముగిశాయి.
East Godavari: ఖాతీ విధులకు హ్యాట్సాఫ్.. మేరీ మాత వేడుకల్లో పోలీసుల అంకితభావం!
తూర్పు గోదావరి జిల్లా: దేవరపల్లి పరిధిలోని గౌరీపట్నం నిర్మలగిరి మేరీ మాత ఉత్సవాలు ఈసారి అత్యంత ఘనంగా, ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. సి.ఐ నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టడంతో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. ఉత్సవాల మొదటి మూడు రోజుల్లో రోజుకు సుమారు 50 వేల నుంచి లక్షలోపు భక్తులు తరలి వచ్చి నిర్మలగిరి మేరీమాతను దర్శించుకున్నారు. చివరి రోజుల్లో అయితే భక్తుల రద్దీ మరింత పెరిగి రెండు లక్షలకు పైగా ప్రజలు పాల్గొనడం విశేషం.
భక్తుల భారీ రద్దీ ఉన్నప్పటికీ ట్రాఫిక్ సమస్యలు లేకుండా పోలీసులు సమర్థవంతంగా నిర్వహణ చేపట్టారు. ముఖ్యంగా రహదారులపై ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవడం వల్ల ప్రజలు ఎలాంటి ఆటంకం లేకుండా దర్శనం పూర్తి చేసుకున్నారు. నాలుగు రోజుల పాటు పోలీసులు నిద్రాహారాలు మానుకొని విధుల్లో నిమగ్నమై తమ కర్తవ్యనిబద్ధతను చాటుకున్నారు.
సి.ఐ నాయక్ స్వయంగా రంగంలోకి దిగి వాకీటాకీ ద్వారా కిందస్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ పరిస్థితిని పర్యవేక్షించారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఉత్సవాలు సాఫీగా జరిగాయి. ఉత్సవాల్లోకి ప్రవేశించిన కొన్ని పోకిరి గుంపులపై కూడా పోలీసులు నిఘా ఉంచి వారి కదలికలను పర్యవేక్షిస్తూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడ్డుకున్నారు.
మొత్తంగా భక్తుల సహకారం, పోలీసుల కృషి కలిసి ఈ ఉత్సవాలను విజయవంతం చేశాయి. భక్తులు సైతం పోలీసుల సేవలను అభినందిస్తూ ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.




