East Godavari: కాకినాడ పోలీసుల పక్షపాతం.. బాధితులపైనే అక్రమ కేసులు?

East Godavari: తమపై అక్రమ కేసులు బనాయించి కుటుంబాన్ని వేధిస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా పెద్దగూడెంకు చెందిన గణేష్ కుటుంబం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 April 2026 11:46 AM IST
East Godavari
X

East Godavari: కాకినాడ పోలీసుల పక్షపాతం.. బాధితులపైనే అక్రమ కేసులు?

East Godavari: తమపై అక్రమ కేసులు పెట్టి కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపిస్తూ తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం పెద్దగూడెంకు చెందిన ఒక కుటుంబం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. బొడ్డు విజయ్ అనే వ్యక్తి రాజకీయ అండదండలతో తమపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడని, దీనికి కాకినాడ పోలీసులు మద్దతు ఇస్తున్నారని వారు ఆరోపించారు.

నిడదవోలు మండలం తిమ్మరాజు పాలెం గ్రామానికి చెందిన గణేష్ తన కుటుంబంతో అక్కడే నివసిస్తున్నాడు. గ్రామానికి చెందిన బొడ్డు విజయ్ అలియాస్ షావుకారు గల్ఫ్ దేశంలో ఉంటూ గణేష్ భార్యను విదేశాలకు పంపితే అధిక ఆదాయం వస్తుందని నమ్మబలికి తీసుకెళ్లాడని గణేష్ తెలిపాడు. అయితే అక్కడ ఆమెను పని పెట్టకుండా తన దగ్గరే ఉంచుకుని అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించాడు. ఈ విషయం తెలిసిన గణేష్ గల్ఫ్‌లోని భారతీయ ఎంబసీ సహాయంతో తన భార్యను తిరిగి స్వగ్రామానికి తీసుకువచ్చినట్లు పేర్కొన్నాడు.

ఈ ఘటనను జీర్ణించుకోలేని విజయ్, తన భార్యతో కలిసి తనపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపించాడని గణేష్ ఆరోపించాడు. అంతేకాక తనకు మద్దతుగా నిలుస్తున్న కుటుంబ సభ్యులను కూడా లక్ష్యంగా చేసుకున్నాడని తెలిపాడు. సోషల్ మీడియా వేదికలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో తన సోదరీమణులపై దుష్ప్రచారం చేయిస్తూ వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించాడు.

కష్టకాలంలో తమకు అండగా నిలిచిన తన బావ శ్రీనుపై కూడా అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెడుతున్నారని గణేష్ పేర్కొన్నాడు. ఈ వ్యవహారంలో కాకినాడ పోలీసులు పక్షపాతం చూపుతూ తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని, దీనిపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించి న్యాయం చేయాలని ఆ కుటుంబం విజ్ఞప్తి చేసింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story