Amaravati: లోక్‌సభలో అమరావతి బిల్లు: ఏపీ రాజధానిగా చట్టబద్ధతకు ముందడుగు.. రేపు రాజ్యసభకు!

Amaravati: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది.

Arun Chilukuri
Published on: 1 April 2026 12:34 PM IST
Amaravati
X

Amaravati: లోక్‌సభలో అమరావతి బిల్లు: ఏపీ రాజధానిగా చట్టబద్ధతకు ముందడుగు.. రేపు రాజ్యసభకు!

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై దశాబ్ద కాలంగా కొనసాగుతున్న సందిగ్ధతకు తెరదించే దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక అడుగు వేసింది. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే **‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ బిల్లు’**ను బుధవారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

సభలో కీలక పరిణామాలు:

ఈ బిల్లుపై చర్చించేందుకు స్పీకర్ ఓంబిర్లా ప్రాథమికంగా గంట సమయం కేటాయించారు. సభ్యుల విజ్ఞప్తి మేరకు అవసరమైతే మరో గంట పాటు చర్చను పొడిగిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు.

ఈ బిల్లుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ సభలో మాట్లాడుతూ.. అమరావతిని రాజధానిగా గుర్తించే నిర్ణయాన్ని తమ పార్టీ స్వాగతిస్తోందని తెలిపారు.

బిల్లుపై చర్చ ముగిసిన అనంతరం మూజువాణి ఓటు ద్వారా దీనిని ఆమోదించనున్నారు.

తదుపరి అడుగు రాజ్యసభ వైపు

లోక్‌సభలో ఆమోదం పొందిన తర్వాత, ఈ బిల్లు గురువారం (రేపు) రాజ్యసభ ముందుకు రానుంది. ఎగువ సభలో కూడా ఆమోదం పొంది, రాష్ట్రపతి ముద్ర పడితే.. ఏపీ పునర్విభజన చట్టం-2014లో అధికారికంగా సవరణ జరుగుతుంది. తద్వారా అమరావతికి చట్టపరంగా తిరుగులేని హోదా దక్కనుంది.

గత కొన్నేళ్లుగా మూడు రాజధానుల అంశంతో నెలకొన్న అనిశ్చితికి ఈ బిల్లుతో శాశ్వత పరిష్కారం లభించనుండటంతో, అటు అమరావతి రైతులు, ఇటు ఏపీ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story