Amaravati: రాజధానిపై అసెంబ్లీ ముద్ర.. 28న రాష్ట్ర శాసనసభ ప్రత్యేక భేటీ

Amaravati: మార్చి 28న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. అమరావతిని ఏకైక రాజధానిగా ఖరారు చేస్తూ శాసనసభలో కీలక తీర్మానం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 March 2026 12:24 PM IST
Amaravati
X

Amaravati: రాజధానిపై అసెంబ్లీ ముద్ర.. 28న రాష్ట్ర శాసనసభ ప్రత్యేక భేటీ

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఈ నెల 28న రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ ప్రత్యేక సమావేశం ప్రధానంగా రాజధాని అంశంపై కీలక నిర్ణయాలకు వేదికగా మారనుందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఖరారు చేస్తూ ఇప్పటికే మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం ఆమోదం పొందింది. ఈ తీర్మానాన్ని ఇప్పుడు అసెంబ్లీ ముందు ఉంచి ఆమోదం పొందే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీని ద్వారా రాజధాని అంశంపై స్పష్టత తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించబడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధి దిశలో ఒకే రాజధాని అంశాన్ని ముందుకు తీసుకెళ్లడం అవసరమనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా రాజధాని అంశంపై వివిధ రాజకీయ చర్చలు, వాదోపవాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం మరింత పెరిగింది.

ఇక అసెంబ్లీలో ఆమోదం పొందిన అనంతరం, అదే తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపేందుకు క్యాబినెట్ కూడా తన అంగీకారం తెలపనుంది. రాష్ట్ర శాసనసభ తీర్మానంతో పాటు క్యాబినెట్ మద్దతు ఉండటం ద్వారా కేంద్రానికి స్పష్టమైన సంకేతం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ చర్యతో అమరావతిని రాజధానిగా అధికారికంగా స్థిరపరచే ప్రక్రియ వేగవంతం అవుతుందని అంచనా వేస్తున్నారు.

ప్రత్యేక సమావేశం సందర్భంగా ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా వెల్లడించనుంది. అమరావతి అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశముంది. మరోవైపు ఒక్కరోజు నిర్వహించే ఈ సమావేశాల కు వైసీపీ సైతం ఈ అంశంపై తమ అభిప్రాయాలను గట్టిగా వినిపించే అవకాశం ఉంది. దీంతో అసెంబ్లీలో చర్చలు ఉత్కంఠభరితంగా సాగనున్నాయి.

మార్చి 28న జరగనున్న ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రాష్ట్ర భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక ఘట్టంగా భావించవచ్చు. అమరావతి రాజధాని అంశంపై తుది నిర్ణయానికి ఈ సమావేశం దారితీయనున్న నేపథ్యంలో అన్ని వర్గాల దృష్టి ఇప్పుడు ఈ సమావేశంపైనే కేంద్రీకృతమైంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, అసెంబ్లీలో జరిగే చర్చలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలకనున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story