Mydukur: చారిత్రక వింత పొలాల్లో 17వ శతాబ్దపు విగ్రహం!

Mydukur: కడప జిల్లా మైదుకూరు మండలం ఉప్పగుంటపల్లెలో 17వ శతాబ్దానికి చెందిన చాముండి విగ్రహం వెలుగులోకి వచ్చింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 April 2026 6:19 PM IST
Mydukur
X

Mydukur: చారిత్రక వింత పొలాల్లో 17వ శతాబ్దపు విగ్రహం!

Mydukur: మైదుకూరు మండలం ఉప్పగుంటపల్లె లో దశరథ రామిరెడ్డి, సుధాకర్ రెడ్డి పొలాల్లో నాగులపుట్ట వద్ద పెద్దిరెడ్డి శివశంకర్ రెడ్డి నీటితో శుభ్రం చేస్తుండగా 17వ శతాబ్దం నాటి చాముండి విగ్రహం బయలు పడి, వెలుగులోకి వచ్చినట్టు రచయిత చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ ఆదివారం మీడియాకు తెలిపారు. చండ, ముండ అనే ఇద్దరు రాక్షసులను తన ఖడ్గంతో సంహరించడంతో ఆమెకు చాముండి (చాముండేశ్వరి) అను పేరు వచ్చిందని చెప్పారు. ఈమె పార్వతీదేవి ఉగ్ర అవతారమని, సప్తమాతృకలలో ఒకరిని, ప్రత్యేకమని తెలిపారు.

శిల్ప వర్ణన..

ఈ విగ్రహంలో చాముండేశ్వరి దేవి సుఖాసనములో (ఒక కాలు ఆసనముపై పరుండబెట్టి మరియొక కాలు సుఖంగా క్రిందికి విడవడం) కూర్చొని ఉందని చెప్పారు. కుడికాలు క్రింద ఒక తల, ఎడమ కాలు కింద రెండు తలలు (ముండా అనే రాక్షసుని) ఉన్నాయన్నారు. తలపై కిరీటం, కళ్ళు పెద్దవిగా, ముక్కునొక్కుపోయినట్లుగా, చెవులకు పెద్దపెద్ద లోలాకులు ధరించి ఉందని వివరించారు. మెడలో కంటె,శేరు ధరించినట్లు, స్థనాలను ప్రస్ఫుటంగా శిల్పీకరించారు. ఉదరం బక్క చిక్కినట్లుగా, (సింహ మధ్యమం)

సన్నని నడుం అద్భుతంగా చెక్కారన్నారు. ఉదరం నుంచి‌ పిక్కల వరకు అర్ధచంద్రాకృతిలో ఉన్న వస్త్రాలను ధరించినట్లుందని తెలిపారు. కుడివైపు పై చేతిలో ఢమరుకం కింది చేతిలో ఖడ్గం, ఎడమ వైపు కింది చేతితో రాక్షసుని తల కేశాలను పట్టుకున్నట్లుగా, పై చేయి లో త్రిశూలం పట్టుకున్నట్లుగా చూపరులను ఆకర్షించే విధంగా చిత్రీకరించారన్నారు. చేతులలో కేయురాలు, ముంజేతి వలయాలు ఉన్నాయని చెప్పారు.

స్థానిక ఆచారాలు..

నెల్లూరు జిల్లాలోని పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి తిరుణాల మరుసటి దినం పౌర్ణమి రోజున ఉప్పగుంటపల్లె మొలకల (కుంపటిలో సొద్దులు ,జొన్నలు, ఉలవల విత్తనాలు మొలకెత్తడం) పండుగ జరపడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఇక్కడ చాముండి దేవత ఉందని మాకు తెలియదని గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

స్థానిక కథ ..

పెద్దిరెడ్డి అబ్బిరెడ్డి ఇంట్లో తిరుమల రామయ్య యాదవ్ పాలేరుగా పనిచేసే వారన్నారు. ఇతనికి ఒక రోజు పెంచలకోనల లక్ష్మీనరసింహస్వామి ఒళ్ళులోకి రావటంతో అబ్బిరెడ్డి ఇంట్లో దేవుని మూల లో ఇసుకను ఏర్పాటు చేశాక ఆ ఇసుకలో స్వామి పాదాలు పడ్డాయని గ్రామస్తులు కథలుగా చెబుతున్నారని రచయిత వివరించారు. ఆ పాదాల కొలతలను తీసుకొని తయారుచేసిన పాదుకలు ఇప్పటికీ ఉండడం గమనార్హమని వివరించారు. వీటిని ఇప్పటికీ ఉప్పగుంటపల్లె మొలకల తిరుణాలకు తీసుకురావడం ఆనవాయితీగా వస్తుందని వెల్లడించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story