Guntakal: గుంతకల్లు, గుత్తి మున్సిపాలిటీల్లో మన జెండా ఎగరాలి: వైఎస్సార్‌సీపీ!
Guntakal: స్థానిక సంస్థల ఎన్నికల్లో గుత్తి, గుంతకల్లు మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలని సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి పిలుపు. ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు.
Guntakal: గుంతకల్లు, గుత్తి మున్సిపాలిటీల్లో మన జెండా ఎగరాలి: వైఎస్సార్‌సీపీ!
గుంతకల్లు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గుంతకల్లు, గుత్తి మున్సిపాలిటీల్లో అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు.
అనంతపురం జిల్లా గుత్తిలో గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వెన్నుపోటు పార్టీ పాలనలో దౌర్జన్యాలు, అక్రమాలు, కేసులు, అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొత్త హామీల పేరుతో ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
గుంతకల్లు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డులో పార్టీని మరింత బలోపేతం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేసేలా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.




