Tadipatri: తాడిపత్రిలో భిక్షాటన చేయకండి.. అండగా ఉంటా జేసీ

Tadipatri: తాడిపత్రిలో భిక్షాటన నిర్మూలనకు సహకరించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపు. పేదలకు ఆశ్రయం, ఉపాధి కల్పిస్తాం.. లేదంటే హిట్లర్‌లా మారాల్సి వస్తుందని హెచ్చరిక.

DILIP KUMAR, TADIPATRI
Published on: 30 July 2026 4:35 PM IST
Tadipatri
X

Tadipatri: తాడిపత్రిలో భిక్షాటన చేయకండి.. అండగా ఉంటా జేసీ

తాడిపత్రి: తాడిపత్రి పట్టణంలో భిక్షాటన నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురుపౌర్ణమి సందర్భంగా పట్టణంలోని పలు దేవాలయాల వద్ద చిన్నారులు, మహిళలు, వృద్ధులు భిక్షాటన చేయడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గురువారం తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన మాట్లాడుతూ, దేవాలయాలకు భక్తితో వచ్చే ప్రజల ముందు చిన్నారులు సైతం భిక్షాటన చేయడం బాధాకరమైన విషయమన్నారు. చిన్న వయస్సులోనే పిల్లలను భిక్షాటనకు పంపించడం వారి భవిష్యత్తును నాశనం చేయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు.

పేదరికం, ఆర్థిక ఇబ్బందులు ఉన్న కుటుంబాలు ఎవరైనా ఉంటే తమను నేరుగా సంప్రదించాలని కోరారు. అలాంటి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఉపాధి అవకాశాలు కల్పించడం, అవసరమైతే ఆశ్రయం కల్పించడం వంటి అంశాల్లో కూడా సహకరిస్తామని తెలిపారు.

తాడిపత్రిలో ఇప్పటికే జీవనాలయం, రమణ మహర్షి వంటి సేవా సంస్థలు నిరాశ్రయులు, అనాథలు, వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తూ సేవలు అందిస్తున్నాయని గుర్తు చేశారు. ఇలాంటి కేంద్రాల సేవలను అవసరమైన వారు వినియోగించుకోవాలని సూచించారు.

దేవాలయాల వద్ద భిక్షాటన చేయడం వల్ల పిల్లల విద్యకు, వారి భవిష్యత్తుకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. చిన్నారులను పాఠశాలలకు పంపించి, మంచి విద్య అందించడం తల్లిదండ్రుల బాధ్యత అని అన్నారు.

భిక్షాటనను ప్రోత్సహించకుండా సమాజం మొత్తం కలిసి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అవసరమైన వారికి ఆహారం, ఆశ్రయం, ఉపాధి కల్పించే దిశగా ముందుకు రావాలని జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు. భిక్షాటన రహిత తాడిపత్రి నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేకపోతే మీరు నిర్ణయించుకోవాలని సహాయ సహకారాలు కావాలో.. లేకపోతే నేను హిట్లర్ గా మారడం కావాలో నిర్ణయించుకోవాలన్నారు.

DILIP KUMAR, TADIPATRI

DILIP KUMAR, TADIPATRI

Next Story