Rayadurgam: గ్రామీణ వైద్య సేవలను బలోపేతం చేయాలి: ఎమ్మెల్యే కాలవ!

Rayadurgam: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అసెంబ్లీలో కోరారు.

M. MITHRAM, ANANTAPURURAM
Published on: 20 Aug 2026 4:40 PM IST
Rayadurgam
X

Rayadurgam: గ్రామీణ వైద్య సేవలను బలోపేతం చేయాలి: ఎమ్మెల్యే కాలవ!

రాయదుర్గం: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం మరింత శ్రద్ధ చూపాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో గురువారం ఆయన మాట్లాడుతూ, రాయదుర్గం నియోజకవర్గంలో 35 గ్రామీణ వైద్య కేంద్రాల భవన నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు.

ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అధిక నిధులు తీసుకురావడంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని అభినందించారు. రాయదుర్గం పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) ఆసుపత్రి నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయన్నారు. మంత్రి స్వయంగా పరిశీలించారని, జిల్లా అధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లామని గుర్తు చేశారు.

ఆగిపోయిన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా బొమ్మనహాల్ మండలం దర్గా హోన్నూరులో గత టిడిపి పాలనలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తాను మంజూరు చేయించానన్నారు. ఎలాంటి వసతులు, వైద్య పరికరాలు లేకుండానే గత వైసిపీ నాయకులు భవనాన్ని హడావుడిగా ప్రారంభించారన్నారు.

పీహెచ్‌సీలో పనిచేసే వైద్యులు, సిబ్బంది కోసం అవసరమైన క్వార్టర్స్ నిర్మించడంతో పాటు వైద్య పరికరాలను మంజూరు చేయాలని కోరారు. తద్వారానే గ్రామీణ ప్రజలకు స్థానికంగా మెరుగైన వైద్య సేవలు అందించడానికి వీలవుతుందన్నారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు విజ్ఞప్తిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందిస్తూ... ఆసుపత్రుల్లో అవసరమైన వసతుల కల్పనకు ఎంతమేరకు అవకాశం ఉందో పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

M. MITHRAM, ANANTAPURURAM

M. MITHRAM, ANANTAPURURAM

Next Story