Puttaparthi: మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత ఎస్ఐ!
Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం వెంగళం చెరువు గ్రామంలో "పల్లె బాటలో ఈగిల్" కార్యక్రమం నిర్వహించారు.
Puttaparthi: మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత ఎస్ఐ!
పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం వెంగళం చెరువు గ్రామంలో "పల్లె బాటలో ఈగిల్" కార్యక్రమాన్ని నిర్వహించి మాదకద్రవ్యాల నిర్మూలనపై గ్రామ ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి జిల్లా ఈగిల్ విభాగం సబ్-ఇన్స్పెక్టర్ కొమ్ము శ్రీహరి ఆధ్వర్యంలో మహిళా పోలీసు కానిస్టేబుల్ పద్మ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, యువత, విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక, ఆర్థిక దుష్పరిణామాలపై వివరించారు. మాదకద్రవ్యాల బారిన పడితే వ్యక్తిగత జీవితం, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు.
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించి మంచి భవిష్యత్తు కోసం కృషి చేయాలని సూచించారు. మాదకద్రవ్యాల విక్రయం, వినియోగం, నిల్వ లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ఏపీ ఈగిల్ హెల్ప్‌లైన్ 1972కు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.
మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, ప్రతి గ్రామాన్ని డ్రగ్స్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువత, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొని "మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటాం – డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సహకరిస్తాం" అంటూ ప్రతిజ్ఞ చేశారు.




