Rayadurgam: చేనేత కార్మికులకు అండగా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే కాలవ

Rayadurgam: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాయదుర్గంలో చేనేత కార్మికులకు రూ. 25 వేల ఆర్థిక సహాయం. నేతన్నలకు అండగా కూటమి ప్రభుత్వం ఉందన్న ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు.

M.MITHRAM CHARKRAVARTHY, RAYADURGAM
Published on: 7 Aug 2026 5:28 PM IST
Rayadurgam
X

Rayadurgam: చేనేత కార్మికులకు అండగా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే కాలవ

రాయదుర్గం: “ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులకు ఒక పండుగ రోజు. తరతరాలుగా చేనేత వృత్తిని కొనసాగిస్తూ.. కష్టాలు వచ్చినా, నష్టాలు ఎదురైనా తమ వృత్తిని వదులుకోకుండా ముందుకు సాగుతున్న నేతన్నలకు అండగా నిలిచే రోజు.

అటువంటి చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి రూ.25 వేల ఆర్థిక సహాయం అందిస్తున్న రోజు కావడం ఎంతో సంతోషంగా ఉంది” అని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాయదుర్గం పట్టణంలో చేనేత కార్మికుల ఇంటికి వెళ్లి ప్రభుత్వ సాయం గురించి వివరించారు.

ఈ సందర్భంగా నేత కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి నేటి వరకు రాష్ట్రంలోని చేనేత కార్మికులు పార్టీకి అండగా నిలుస్తున్నారన్నారు. నేతన్నలతో తెలుగుదేశం పార్టీకి విడదీయరాని అనుబంధం ఉందన్నారు.

రాజకీయంగా ఎన్నో సంక్షోభాలు వచ్చినా, ఎంతోమంది ఎన్నో రకాల మాయ మాటలు చెప్పినా... చేనేత వర్గం మాత్రం తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన వర్గంగా కొనసాగుతూ వస్తోందన్నారు. చేనేత కార్మికులు తెలుగుదేశం పార్టీకి అందించిన ఆదరణ, అండదండలకు మేము ఎంత చేసినా తక్కువనని, వారి రుణం తీర్చుకోలేనిదన్నారు.

చేనేత కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 54 వేల మంది చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుండటం చాలా ఆనందంగా ఉందన్నారు.

నేతన్న కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ సహాయం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తపరిచారు. ఆర్థిక చేయూత అందించడం ద్వారా కష్టకాలంలో ప్రభుత్వం తమకు అండగా ఉందనే భరోసా వారిలో కల్పించినట్లు అవుతోందన్నారు.

ఇంతకుముందు మగ్గం మీద పనిచేసే చేనేత కార్మికులకే పరిమితమైన ప్రయోజనాలను చేనేతకు అనుబంధంగా రాట్నం వడికేవారు, రంగులు అద్దే కార్మికులకు కూడా నేతన్న సేవలో పథకం వర్తింపజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు. దీనివల్ల మరో సుమారు 10 వేల మందికి అదనంగా ప్రయోజనం కలిగే అవకాశం ఉందన్నారు.

ఈ ఏడాది బడ్జెట్‌లో చేనేత రంగానికి ప్రత్యేకంగా రూ.250 కోట్ల నిధులు కేటాయించామని, ఎక్కడ అవకాశం ఉన్నా చేనేత కార్మికులకు మరింత సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ప్రతి చేనేత కార్మికుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విన్నవించారు. అర్హత ఉన్నప్పటికీ ఏ కారణం చేతనైనా జాబితాలో పేరు రాని చేనేత కార్మికులు ఎవరైనా ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అలాంటి వారిని కూడా గుర్తించి లబ్ధిదారులుగా చేర్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.

రాయదుర్గం అంటేనే చేనేతలకు పుట్టినిల్లనీ, ఒకప్పుడు పట్టణంలో వేలాది కుటుంబాలు మగ్గాలపైనే ఆధారపడి జీవించేవని గుర్తు చేశారు. కాలక్రమంలో గార్మెంట్స్ పరిశ్రమ అభివృద్ధి చెందడంతో చాలామంది తమ వృత్తిని మార్చుకుని కుట్టుమిషన్లు ఏర్పాటు చేసుకుని గార్మెంట్స్ రంగంలోకి వెళ్లారన్నారు.

అయినప్పటికీ రాయదుర్గం ప్రాంతంలో సుమారు 250 మంది చేనేత కార్మికులకు ఈ సహాయం అందుతోందన్నారు. అంతేకాకుండా గుమ్మగట్ట మండలంలో సుమారు 300 మంది కంబళ్లను నేసే కార్మికులు ఉన్నారనీ వారిని కూడా ‘నేతన్న సేవలో’ పథకం కింద లబ్ధిదారులుగా గుర్తించాలని చేనేత, జౌళి శాఖ మంత్రి సవితమ్మకు వినతిపత్రం అందించామన్నారు.

ప్రభుత్వం దీనిపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని, త్వరలోనే వారికి కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనం అందుతుందని ఆశిస్తున్నామన్నారు. నేతన్న మగ్గం ఆగకూడదు.. నేతన్న కుటుంబంలో పొయ్యి ఆరిపోకూడదు..

చేనేత కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్య మన్నారు. చేనేత కార్మికులు మాపై చూపిస్తున్న ఆదరణకు ఎప్పటికీ రుణపడి ఉంటామని, వారి ఆశీస్సులు, అండదండలు, ఆదరణ ఎల్లప్పుడూ తనపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లపై ఉండాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే కాలవ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు ఇంఛార్జి ప్రవీణ్, రాష్ట్ర మాజీ చేనేత డైరెక్టర్ టoకశాల హనుమంతు, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పోరాళ్ల పురుషోత్తం, గుద్దిటి లోకేష్,ఎల్లప్ప,కాంబ్లీ రాజశేఖర్, మంతా సీన, ధనర్జున, వడ్డే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

M.MITHRAM CHARKRAVARTHY, RAYADURGAM

M.MITHRAM CHARKRAVARTHY, RAYADURGAM

Next Story