Rayadurgam: రాయదుర్గంలో వినాయక నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు!

Rayadurgam: రాయదుర్గంలో వినాయక నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్, తహశీల్దార్, రూరల్ సీఐ పరిశీలించారు. నాన్ చెరువు, కనేకల్ హెచ్‌ఎల్‌సీ వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు.

M. MITHRAM, ANANTAPURURAM
Published on: 12 Sept 2026 3:54 PM IST
Rayadurgam
X

Rayadurgam: రాయదుర్గంలో వినాయక నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు!

Rayadurgam: రాయదుర్గం పట్టణంలో వినాయక నిమజ్జనానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ఎక్కడ స్థలం అనుకూలంగా ఉంటుందనే అంశంపై మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, తహసీల్దార్ సూర్యప్రతాప్‌తో రూరల్ సీఐ దేవానంద్ మరియు వివిధ శాఖల అధికారులు కలిసి పట్టణ పరిసరాల్లో ఆరు ప్రాంతాలను పరిశీలించారు.

అందులో భాగంగా నాన్ చెరువు ప్రాంతాన్ని నిమజ్జనానికి అనుకూలంగా గుర్తించారు. అక్కడ పెద్ద దీర్ఘచతురస్రాకారంలో కుంట తరహాలో గొయ్యిని ఏర్పాటు చేసి, ట్యాంకర్ల ద్వారా నీటిని నింపి నిమజ్జన ఏర్పాట్లను ప్రారంభించారు.

ఐదు అడుగుల లోపు ఉన్న వినాయక విగ్రహాలు, చిన్న విగ్రహాలను ఈ ప్రాంతంలోనే నిమజ్జనం చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే మార్కెట్ యార్డ్ సమీపం లో ఉన్న కుంట లో కూడా నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అక్కడ బారికేడ్లు, విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైన చోట క్రేన్ సహాయంతో నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

అదేవిధంగా పెద్ద వినాయక విగ్రహాలను కనేకల్ హెచ్‌ఎల్‌సీ కాలువలో నిమజ్జనం చేసే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు.

M. MITHRAM, ANANTAPURURAM

M. MITHRAM, ANANTAPURURAM