Penukonda: పెనుకొండ కోట బసవన్న బావిలో అరుదైన శిలాశాసనం
Penukonda: పెనుకొండ కోటలోని బసవన్న బావిలో అరుదైన 'శ్రీత్రయంబక శరణు' సంస్కృత ఏకవాక్య శాసనాన్ని వెల్లడించిన చరిత్రకారుడు మైనాస్వామి.
Penukonda: పెనుకొండ కోట బసవన్న బావిలో అరుదైన శిలాశాసనం
పెనుకొండ: విజయనగర సామ్రాజ్య ద్వితీయ రాజధానిగా చారిత్రక ప్రాధాన్యత కలిగిన పెనుకొండకోట పరిధిలోని కాశీవిశ్వేశ్వర ఆలయానికి ఎదురుగా ఉన్న ‘బసవన్న బావి’ (మెట్లబావి-కోనేరు) లోపలి రాతిపై అరుదైన ‘శ్రీత్రయంబక శరణు’ సంస్కృత ఏకవాక్యాన్ని జలనిధి శాసనంగా చరిత్రకారుడు మైనాస్వామి విశ్లేషించారు.
విజయనగర సామ్రాజ్య చక్రవర్తులైన శ్రీక్రిష్ణదేవరాయలు, అచ్యుతదేవరాయల పాలనాకాలపు జలసంస్కృతి, నిర్మాణనైపుణ్యం మరియు శైవ సంప్రదాయాలకు ఈ శాసనం బలమైన ఆధారంగా నిలుస్తోంది. బావి లోపలి రాతి నిర్మాణంపై ‘శ్రీత్రయంబక శరణు’ అని రెండు వరుసలలో కన్నడ లిపిలో ఏకవాక్య శాసనం చెక్కబడి ఉంది.
శాసనం చివరలో అక్షరాల పక్కన సూర్యుడు, అర్ధచంద్రుడు మరియు వీటి మధ్య అధోముఖంగా (కిందికి తిరగేసి) ఉన్న చిన్నఖడ్గం రాజముద్రగా చెక్కబడి ఉన్నాయి. ఆ పక్కనే చిన్న శివలింగాన్ని శిల్పి సుందరంగా మలిచారని చరిత్రకారుడు మంగళవారంనాడు పాత్రికేయులకు వివరించారు.
శ్రీక్రిష్ణదేవరాయలు మరియు అచ్యుతదేవరాయల హయాంలో కోనేరులు, మెట్లబావులు నిర్మించేటప్పుడు,ఆ నీరు ఎప్పటికీ ఎండిపోకుండా, తాగునీరు ఉపయోగించే ప్రజలకు ఆయురారోగ్యాలు కలగాలని మహా మృత్యుంజయుడైన త్రయంబకేశ్వరుని శరణువేడుతూ ఇలాంటి మంగళవాక్యాలను పొందుపరిచేవారని మైనాస్వామి తెలిపారు.
శాసనాల్లో సాధారణంగా పైకి ఉండే ఖడ్గం యుద్ధానికి సంకేతమైతే, ఇక్కడ కిందికి దించబడిన ఖడ్గం రక్షణ,శాంతి మరియు ఆత్మసమర్పణకు ప్రతీకగా నిలుస్తోంది.రాజశక్తి కంటే దైవశక్తి మిన్న అని భావిస్తూ, ఆ త్రయంబకుని పాదాలచెంత ఖడ్గాన్ని ఉంచి- శరణాగతి కోరడాన్ని ఇది సూచిస్తుంది.
'ఆచంద్రార్కo'గా (సూర్యచంద్రులు ఉన్నంతకాలం) ఈ జలాశయం అక్షయమైన జలనిధితో వర్ధిల్లాలని, విజయనగర రాజవంశం మరియు దైవిక రక్షణ ఈ ధర్మకార్యానికి తోడుగా ఉంటుందని ఈ ముద్ర స్పష్టం చేస్తోంది. కాశీ విశ్వేశ్వర ఆలయం, బసవన్న బావి పేరు మరియు ‘శ్రీత్రయంబక శరణు’ శాసనం కలసి పెనుకొండలోని శైవ సాంప్రదాయ వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
విజయనగర పాలకుల జలసంరక్షణ దృక్పథాన్ని, వారి కళాపోషణను తెలిపే ఇలాంటి ప్రాచీన దిగుడు బావులను, శాసనాలను రక్షించి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మైనాస్వామి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
దైవిక శిల్పాలు: బసవన్న బావిగా పిలవబడుతున్న సుందరమైన మెట్ల బావిలో తూర్పుముఖంగా గోడపై వివిధ దైవిక శిల్పాలు సుందరంగా ఉన్నాయని చరిత్రకారుడు చెప్పారు. పైభాగంలో నటరాజస్వామి, దిగువనే వినాయకుడు ఆ కింద గజలక్ష్మి అట్టడుగున శివునివాహనమైన నంది శిల్పాలు సుమనోహరంగా విజయనగర శిల్పులు చెక్కారని, మెట్లబావి ఒక ఆలయాన్ని తలపిస్తున్నదని మైనాస్వామి తెలియజేశారు.




