Penukonda: పెనుకొండలో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ కార్యక్రమం ప్రారంభం

Penukonda: పెనుకొండలో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సవిత. సత్యసాయి జిల్లాలో 13 లక్షల సీడ్ బాల్స్ వెదజల్లుతున్నట్లు వెల్లడి.

K.UDAY BHANU, PENUKONDA
Published on: 12 Aug 2026 8:23 PM IST
Penukonda
X

Penukonda: పెనుకొండలో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ కార్యక్రమం ప్రారంభం

పెనుకొండ: అటవీ శాఖ ఆధ్వర్యంలో సీడ్ బాల్స్‌ను డ్రోన్‌ల ద్వారా వెదజల్లే కార్యక్రమాన్ని పెనుకొండ లోని జాతీయ రహదారి పక్కన ఉన్న కొండ ప్రాంతం లో మంత్రి సవిత ప్రారంభించారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నామని ఆమె తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సీడ్ బాల్స్ ద్వారా పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమం కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు.

సత్యసాయి జిల్లాలో సుమారు 13 లక్షల సీడ్ బాల్స్‌ను 113 ప్రాంతాల్లో వెదజల్లేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో అటవీ విస్తీర్ణం సుమారు 14 శాతం మాత్రమే ఉందని, భవిష్యత్తులో పచ్చదనాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు.కరోనా సమయంలో ఆక్సిజన్ కొరతతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేసిన మంత్రి, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలని సూచించారు.

వాతావరణ మార్పుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోందని, అందుకే అడవుల విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. పశువుల పేడతో తయారు చేసిన సీడ్ బాల్స్‌లో విత్తనాలను ఉంచి, వాటిని డ్రోన్‌ల ద్వారా అటవీ, బీడు ప్రాంతాల్లో వెదజల్లుతున్నట్లు తెలిపారు. ప్రకృతి సహజంగా వృద్ధి చెందేలా ఈ విధానం ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు సందర్భంగా ఒక మొక్క నాటే అలవాటు చేసుకోవాలని, ముఖ్యంగా విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని మంత్రి సవిత సూచించారు.

పెనుకొండ లో నగర వనాల అభివృద్ధికి చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. హైవే ప్రాంతంలో సుమారు రూ.2 కోట్లతో నగర వనం ఏర్పాటు చేశామని, అదే విదంగా కొండపై కూడా నగర వనం అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. బీడు భూముల్లో పశుగ్రాసం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.గత ఐదేళ్లలో అటవీ శాఖను గత ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి విమర్శించారు.

ప్రస్తుతం పచ్చదనం, అటవీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఉపాధి హామీ పథకం (NREGS) ద్వారా మారుమూల గ్రామాల్లో కూడా రహదారుల అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, చక్రపాణి జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్, శ్రీనివాసులు పెనుకొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, కే రాహుల్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పెనుకొండ, కుళ్లాయప్ప సెక్షన్ ఆఫీసర్ హిందూపూర్ షఫీ డిఆర్ఓ మడకశిర, కూటమి నాయకులు, కార్యకర్తలు, ఇతర అధికారులు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.

K.UDAY BHANU, PENUKONDA

K.UDAY BHANU, PENUKONDA

Next Story