Kadiri: రౌడీషీటర్ ముజ్జుపై 'పీడీ యాక్ట్' ప్రయోగం కడప సెంట్రల్ జైలుకు తరలింపు!

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వరుస నేరాలకు పాల్పడుతున్న రౌడీషీటర్ షేక్ ముజాహిద్ అలియాస్ ముజ్జుపై పీడీ యాక్ట్ నమోదైంది.

P.RAHAMTULLA, KADIRI
Published on: 9 Aug 2026 8:28 PM IST
Kadiri
X

Kadiri: రౌడీషీటర్ ముజ్జుపై 'పీడీ యాక్ట్' ప్రయోగం కడప సెంట్రల్ జైలుకు తరలింపు!

కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వరుస నేరాలకు పాల్పడుతూ ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్న రౌడీషీటర్ షేక్ ముజాహిద్ అలియాస్ ముజ్జుపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసిన పోలీసులు, నిందితుడిని కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి వెల్లడించారు.

కదిరి పట్టణ అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శివనారాయణ స్వామి మాట్లాడుతూ పదేపదే నేరాలకు పాల్పడుతూ ప్రజాశాంతి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కదిరి గాంధీనగర్‌కు చెందిన 21 ఏళ్ల రౌడీషీటర్ షేక్ ముజాహిద్ అలియాస్ ముజ్జుపై ఆంధ్రప్రదేశ్ డేంజరస్ యాక్టివిటీస్ చట్టం 1986 ప్రకారం పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు.

గత రెండు సంవత్సరాలుగా, ముఖ్యంగా ఇటీవల మూడు నెలల్లో హత్యాయత్నం, గాయపరచడం, బెదిరింపులు, బలవంతపు వసూళ్లు తదితర తీవ్ర నేరాలకు పాల్పడినట్లు అతనిపై పలు కేసులు నమోదయ్యాయని తెలిపారు. పలుమార్లు చట్టపరమైన చర్యలు ఎదుర్కొన్నప్పటికీ నేరప్రవృత్తిని కొనసాగిస్తూ ప్రజల్లో భయాందోళనలు కలిగించే విధంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. పునరావృత నేరప్రవృత్తిని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ డేంజరస్ యాక్టివిటీస్ చట్టంలోని నిబంధనల ప్రకారం అతడిని ‘గూండా’గా పరిగణించినట్లు డీఎస్పీ తెలిపారు.

జిల్లా పోలీసు శాఖ సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ ఏ. శ్యామ్ ప్రసాద్ ఐఏఎస్, చట్టంలోని సెక్షన్ 3(2)(గ) కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. అనంతరం నిందితుడు షేక్ ముజాహిద్ అలియాస్ ముజ్జును కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. ప్రజాశాంతికి విఘాతం కలిగించే విధంగా వరుస నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్‌తో పాటు పోలీసుశాఖ పరంగా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story