Ananthapur: కాంట్రాక్టర్లపై మండిపడ్డ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్
Ananthapur: అనంతపురం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో రెండేళ్లుగా పనులు చేయని కాంట్రాక్టర్లపై ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ananthapur: కాంట్రాక్టర్లపై మండిపడ్డ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్
అనంతపూర్: అనంతపురం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కాంట్రాక్టర్ల తీరుపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా పనులు చేయకుండా ఉన్న కాంట్రాక్టర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అధికారులను ఎమ్మెల్యే ప్రశ్నించారు.
“ఆ కాంట్రాక్టర్లపై మీకు ఎందుకు అంత ప్రేమ?” అంటూ అధికారులను నిలదీశారు.జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పాల్గొన్నారు.నాలుగు పంచాయతీల్లో నెలకొన్న తాగునీటి సమస్యలను ఆయన సభ దృష్టికి తీసుకెళ్లారు.ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా కాంట్రాక్టర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
ఇప్పటికే కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చామని అధికారులు చెప్పగా.. రెండేళ్లుగా పనులు పూర్తి కాకపోతే వచ్చే వేసవిలో తాగునీటి సమస్యను ఎలా ఎదుర్కోవాలని ఎమ్మెల్యే ప్రశ్నించారు. యుద్ధ ప్రాతిపదికన కాంట్రాక్టర్లను తొలగించి, కొత్తవారికి పనులు అప్పగించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.మరోవైపు సమావేశంలో వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ధీటుగా స్పందించారు.
హెచ్‌ఎల్‌సీ, హంద్రీనీవా కాలువల నుంచి వచ్చే నీటిని సాగుకు ఇవ్వాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేయగా.. సూపర్ ఎల్-నినో ప్రభావం నేపథ్యంలో ప్రస్తుతం తాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.గత ఐదేళ్లలో హంద్రీనీవా, హెచ్‌ఎల్‌సీ కాలువల గురించి ఏ రోజైనా పట్టించుకున్నారా అంటూ వైసీపీ సభ్యులను ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హంద్రీనీవాకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.జడ్పీటీసీ, ఎంపీటీసీలకు అలవెన్సులు ఇవ్వడం లేదంటూ వైసీపీ సభ్యులు ప్రభుత్వాన్ని విమర్శించగా.. గత సమావేశాల్లోనే ఈ అంశాన్ని ప్రస్తావించి ఉంటే ప్రభుత్వం ఇప్పటికే చెల్లింపులకు చర్యలు తీసుకునేదని ఎమ్మెల్యే అన్నారు.
వసతి గృహాలు, పాఠశాలల్లో సమస్యలు ఉన్నాయంటూ వైసీపీ సభ్యులు ప్రస్తావించగా.. మంత్రి నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యాశాఖలో అనేక మార్పులు వచ్చాయని ఎమ్మెల్యే తెలిపారు.ప్రభుత్వ విద్యాసంస్థల్లోకి ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులు చేరుతున్నారని, ఎక్కడ సమస్య ఉన్నా మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందిస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పేర్కొన్నారు.




