Anantapur: అనంత ప్రాణదాత ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ 106వ జయంతి!

Anantapur: ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ 106వ జయంతి సందర్భంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఘన నివాళులు అర్పించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 April 2026 12:17 PM IST
Anantapur
X

Anantapur: అనంత ప్రాణదాత ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ 106వ జయంతి!

Anantapur: అనంతపురం జిల్లాలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసి,లక్షలాది మంది ప్రజలకు ప్రాణదాతగా నిలిచిన ఆర్డీటీ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి సేవలను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఘనంగా స్మరించారు.

ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ 106వ జయంతి సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్డీటీ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి పూలమాల వేసి,టీడీపీ మరియు కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఘన నివాళులు అర్పించారు.

అనంతరం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి కూడా పూలమాల వేసి స్మరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ,ఆర్డీటీ సంస్థ అనంతపురం జిల్లాలో సామాజిక భద్రత,నాణ్యమైన వైద్యం,విద్యా అవకాశాలు,గృహాల నిర్మాణం వంటి అనేక రంగాల్లో విశేష సేవలు అందించిందని తెలిపారు. ముఖ్యంగా పంట కుంటల ఏర్పాటుతో భూగర్భ జలాలను పెంచి రైతుల పంటల దిగుబడిని పెంచడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించిందన్నారు. అలాంటి గొప్ప సేవా సంస్థకు 2021లో FCRA రీన్యూవల్ ఆగిపోవడంతో కొంతకాలం ఇబ్బందులు ఎదురయ్యాయని గుర్తుచేశారు.

అయితే ఎన్నికల ముందు మాంచో ఫెర్రర్ గారు చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని కలిసి రీన్యూవల్ విషయంలో వినతిపత్రం సమర్పించారని తెలిపారు. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు,మంత్రులు,ఎంపీలు కలిసి ముఖ్యమంత్రి,నారా లోకేష్ గారిని పలుమార్లు కలిసినట్లు చెప్పారు. కేంద్ర మంత్రుల సహకారంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి ఆర్డీటీ సంస్థ చేస్తున్న సేవలను వివరించి, చివరకు FCRA రీన్యూవల్ సాధ్యమయ్యేలా కృషి చేశామని పేర్కొన్నారు.

ఆర్డీటీ సంస్థ నిర్మించిన ఆసుపత్రులు దేవాలయాల్లా ప్రజలకు సేవలందిస్తున్నాయని, ఇక్కడ లక్షలాది మంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ,భవిష్యత్తులో మరింత విస్తృతంగా సేవలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు,కూటమి ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story