Kalyandurg: రైతుల విద్యుత్ సమస్యపై ఒకే వేదికపై మాజీ ఎంపీ, ఎమ్మెల్యే!

Kalyandurg: కళ్యాణదుర్గం బెలుగుప్ప సబ్‌స్టేషన్ వద్ద రైతుల విద్యుత్ సమస్యపై ఒకే చోట మాజీ ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అమిలినేని.

P.Sudhakar, Anantapuram
Published on: 4 Sept 2026 3:54 PM IST
Kalyandurg
X

Kalyandurg: రైతుల విద్యుత్ సమస్యపై ఒకే వేదికపై మాజీ ఎంపీ, ఎమ్మెల్యే!

Kalyandurg: అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం హనుమరెడ్డిపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద రైతుల విద్యుత్ సమస్యపై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సాగునీటి అవసరాలకు సరిపడా విద్యుత్ సరఫరా కావడం లేదని, లో-వోల్టేజ్ కారణంగా మోటర్లు సక్రమంగా పనిచేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య రైతులతో కలిసి సబ్‌స్టేషన్ వద్ద నిరసన చేపట్టారు.

రైతులకు సకాలంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, విద్యుత్ సరఫరాలో తలెత్తుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్య కారణంగా బోరుబావుల నుంచి నీటిని పంటలకు అందించలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ఇదే సమయంలో అనంతపురం వైపు నుంచి కళ్యాణదుర్గం వైపు వెళ్తున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విషయం తెలుసుకుని హనుమరెడ్డిపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అక్కడ మాజీ ఎంపీ తలారి రంగయ్యతో పాటు రైతులతో మాట్లాడి విద్యుత్ సమస్యకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విద్యుత్ శాఖ ఎస్సీతో ఫోన్‌లో మాట్లాడారు. బోరుబావులకు సరైన విద్యుత్ సరఫరా అందేలా చూడాలని, లో-వోల్టేజ్ సమస్యతో రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సరఫరా సమస్యను సకాలంలో పరిష్కరించాలని సూచించారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ఎమ్మెల్యేను కోరారు. విద్యుత్ సరఫరాలో తలెత్తుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు రైతుల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. దీంతో రైతుల విద్యుత్ సమస్యపై మాజీ ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఒకే చోట ఉండటం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. రైతుల సమస్య పరిష్కారమే లక్ష్యంగా విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

P.Sudhakar, Anantapuram

P.Sudhakar, Anantapuram

Next Story