Pamidi: మీసేవ కేంద్రాల ఆగడాలు - నిబంధనలకు విరుద్ధంగా అధిక వసూళ్లు!
Pamidi: అనంతపురం జిల్లా పామిడి మండలంలోని మీసేవ కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా అధిక రుసుములు వసూలు చేస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజల ఆరోపణ.
Pamidi: మీసేవ కేంద్రాల ఆగడాలు - నిబంధనలకు విరుద్ధంగా అధిక వసూళ్లు!
Pamidi: అనంతపురం జిల్లా పామిడి మండలం పరిధిలోని మీ సేవ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలను ఉల్లంఘించి అధిక రుసుములు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ప్రభుత్వం ప్రతి దరఖాస్తుకు స్పష్టమైన రేటును విధించినప్పటికీ, మీసేవ ఆపరేటర్లు నిబంధనలను బేఖాతరు చేసి నిర్ణీత రుసుము కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డు మార్పులు, పట్టాదారు పాస్ బుక్, ఇతర ఆన్‌లైన్ సేవలకు ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే అదనంగా 100 నుండి 300 రూపాయల వరకు తీసుకుంటున్నారని బాధితులు తెలిపారు.
"ప్రభుత్వ రేటు ఇంత అని అడిగితే సర్వర్ స్లో ఉంది, పని కష్టం అని సాకులు చెప్పి ఎక్కువ డబ్బు అడుగుతున్నారు. ఇవ్వకపోతే పని చేయడం లేదు" అని ఓ రైతు వాపోయారు.
మీసేవ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల జాబితాను కూడా ప్రదర్శించడం లేదని, అధికారులు తనిఖీలు చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
పేద, మధ్యతరగతి ప్రజలకు సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన మీసేవనే కొందరు సొమ్ము చేసుకుంటున్నారని వారు మండిపడుతున్నారు.
వెంటనే రెవెన్యూ, ఐటీ శాఖ అధికారులు స్పందించి తనిఖీలు చేసి నిబంధనలు ఉల్లంఘిస్తున్న మీసేవ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.




